కావేరీ ఇష్యూ: కుమారస్వామి కీలక వ్యాఖ్యలు

16 Jun, 2018 09:32 IST|Sakshi
కర్ణాటక సీఎం కుమారస్వామి (ఫైల్‌ ఫొటో)

మధురై, తమిళనాడు : కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడుల మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందంటూ కర్ణాటక సీఎం కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మధురైలోని శ్రీ మీనాక్షి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవుడి దయతో ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు కురిస్తే.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయంటూ వ్యాఖ్యానించారు.

కాబినీ డ్యామ్‌ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటని విడుదల చేయాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించానని కుమారస్వామి తెలిపారు. తద్వారా రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం కర్ణాటక డ్యామ్‌లలో ఇన్‌ఫ్లో పెరిగిందని పేర్కొన్నారు. ఇకపై కావేరి జలాల పంపకం విషయంలో అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వరుణుడు కరుణిస్తే.. కావేరీ జలాల యాజమాన్య సంస్థ, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్‌ చివరి నాటికి తమిళనాడుకు 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని తెలిపారు.

కాగా కాబినీ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయాలన్న కుమారస్వామి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ‘మక్కల్‌ నీది మయ్యం పార్టీ’ వ్యవస్థాపకుడు కమల్‌ హసన్‌ తెలిపారు. ఈ మేరకు.. ‘ కాబినీ నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉంది. కావేరీ జలాల యాజమాన్య సంస్థ తన పనిని మొదలు పెట్టింది. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాల ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవుతాయి అంటూ కమల్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు