కేరళలో వరద బీభత్సం: ఆరుగురి మృతి

8 Aug, 2019 20:24 IST|Sakshi

కేరళ : ప్రకృతి ప్రకోపానికి మరోసారి కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో భారీ వరదలు సంభవించి ఏడాది గడిచిన తర్వత మళ్లీ అలాటి పరిస్థితే నెలకొంది. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా, దాదాపు 2000 ఇళ్లు నాశనం అయ్యాయి. ఇళ్లలోని వారిని రక్షణ దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇడుక్కి, కోజికోడ్‌, వయనాడ్‌​, మలప్పురం.. నాలుగు జిల్లాల్లో అధికారులు ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు.  అనేక నదులు వాటి సామర్థ్యానికి మించి ప్రవహించడంతో, గత సంవ్సరంతో పోలిస్తే ఈసారి అంతకుమించి వర్షాభావ తీవ్రత ఏర్పడనుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కొండచరియలు విరిగిపడటంతో సంవత్సర బాలుడు మృతి చెందగా, ఇడుక్కిలో మరో ఇద్దరు మరణించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. అధికారులు అ‍ప్రమత్తంగా ఉండి సహాయం కోసం ఎదురుచూసే ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. దీంతోపాటు పది ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సహాయాలను కోరారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను నిలంపూర్‌, ఇడుక్కికి తరలించారు.

>
మరిన్ని వార్తలు