కేరళలో మూడు రోజులు రెడ్‌ అలర్ట్‌

10 Aug, 2018 17:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా కేరళను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దాంతో వాతావరణ శాఖ కేరళలోని ఐదు జిల్లాల్లో పదవ తేదీ నుంచి 13వ తేదీ వరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ముఖ్యంగా పది నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడొచ్చని అంచనా వేస్తున్న తొలి 24 గంటలపాటు మరీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా వందలాది పట్టణాలు, గ్రామాలు నీట మునగడం, వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో దాదాపు 30 మంది మరణించడం తెల్సిందే. రాష్ట్రంలోని అత్యంత పెద్దదైన ఇదుక్కి రిజర్వాయర్‌ (2,403 అడుగుల ఎత్తు) సహా 22 రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం, నౌకా, సైనిక దళాలకు చెందిన సిబ్బంది రంగప్రవేశం చేసి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అత్యంత భయానక పరిస్థితి నెలకొని ఉందని ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ స్వయంగా వ్యాఖ్యానించారంటే అది ఎంతటి తీవ్ర పరిస్థితో అర్థం చేసుకోవచ్చు.

జూన్‌ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ మధ్య సాధారణ వర్షపాతం 1,508.2 మిల్లీ మీటర్లు కాగా, 1,739.4 మిల్లీ మీటర్ల వర్షపాతం అంటే, 15 శాతం అధికంగా పడిందని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. కాసర్‌గాడ్, త్రిస్సూర్‌ మినహా మిగతా 12 జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కొండ చెరియలు విరిగి పడడం వల్లనే ఎక్కువ పాణ హాని జరిగింది, కొండ రాళ్ల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో దాదాపు 20 మంది మరణించారని తెల్సింది. అభివృద్ధి పేరిట ఇష్టమున్నట్లు ఎల్తైన భవంతల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం, క్వారీల్లో బాంబులు పెట్టి పేల్చడం తదితర కారణాల వల్లనే నేడు కొండ చెరియలు ఎక్కువగా విరిగి పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేరళలో పెద్దవి, చిన్నవి, ఓ మోస్తాదివి కలుపుకొని మొత్తంగా 5,924 క్యారీలు ఉన్నాయని కేరళ అటవీ శాఖ తర ఫున ఇటీవల అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు టీజీ సజవ్, సీజె అలెక్స్‌ వెల్లడించారు.

అలప్పూడ్‌ జిల్లా కుట్టానాడ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి జూలై నెలలోనే 1.70 లక్షల మంది వరద బాధతులు చేరుకున్నారు. మౌలిక సౌకర్యాల పేరిట వరద కాల్వలకు చోటు లేకుండా అడ్డదిడ్డంగా రోడ్లు నిర్మించడం వల్ల కేరళకు ఎప్పుడూ వరద ముప్పు పొంచి ఉంటదని ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ఇదివరకే ఓ నివేదికలో హెచ్చరించారు. కేరళలో పలు చోట్ల బీచ్‌లు కూడా మునిగిపోవడానికి మానవ నిర్మాణాలే కారణమని కూడా ఆయన చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం ఇంతకన్నా ఎక్కువ వర్షాలు కురిసినా ఎలాంటి ప్రమాదాలు సంభవించలేదని, ఇప్పుడు ఓ మోస్తారు వర్షాలకే వరద ముప్పు పొంచి ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు