భారీ వర్షాలు : నీటిలో చిక్కుకున్న రైలు

21 Jul, 2018 16:23 IST|Sakshi

సాక్షి, విజయనగరం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రా, ఓడిశా సరిహద్దుల్లో రహదారులకు సమాంతరంగా నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయఘడ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి భువనేశ్వర్‌ నుంచి వెళ్లుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపైకి భారీగా వరద నీరు చేరింది. రైలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింగిపురం, టికిరి స్టేషన్ల మధ్య మరో ట్రైన్‌, ఇంటర్‌సిటీ చిక్కుకోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కూలిన వంతెన
ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయగడ జిల్లా సులిపోదర   గ్రామంలో గోడ కూలి భార్య భర్త మృతి చెందారు. మరో వైపు రాయఘడ జిల్లా జిమిడిపేట వద్ద వరద ఉధృతికి  వంతెన కూలిపోయింది. భారీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. పలుచోట్ల రైలు పట్టాల మీదుగా మూడు అడుగుల ఎత్తులో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.

 
బోల్తా పడ్డ పడవ
భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళిలో గల ఉమిలాడ బీచ్‌లో వేటకు వెళ్లిన పడవ బోల్తాపడింది. వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. దీంతో సహాయక చర్యలు చేట్టిన ఉమిలాడ గ్రామస్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురు మత్స్యకారులు కాపాడారు. వారిని వెంటనే నరసన్న పేట ప్రభుత్వ ఆస‍్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.

పడవ బోల్తాపై ముఖ్యమంత్రి ఆరా
శ్రీకాకుళంలో పడవ బోల్తా సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తుఫానులు వస్తున్న సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండ అప్రమత్తం చేయాలని సూచించారు.

ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగవళి నది పొంగిపొర్లుతోంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో భారీ వర్షాల నేపథ్యంలో పార్వతీపురం ఐటిడిఏ హెల్స్‌ లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎదైనా సహాయం, సమాచారం కోసం 08963221152 హెల్స్‌ లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు