మళ్లీ గొప్పలకు పోతున్న చంద్రబాబు!

21 Jul, 2018 16:09 IST|Sakshi

అవిశ్వాస తీర్మాణంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగినా.. టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు తమదైన శైలిలో మాట్లాడి అసలు విషయాన్ని ప్రస్తావించకుండా సభను రక్తి కట్టించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాద రాజకీయాన్ని, ఇష్టమొచ్చినట్లుగా ఆయన తీసుకున్న యూటర్న్‌లను పార్లమెంట్‌ సాక్షిగా బయటపెట్టేశారు. దీంతో కంగుతున్న చంద్రబాబు ప్రస్తుతం నష్ట నివారణ చర్యలకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. 

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ డ్రామాలు అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా మరోసారి తేటతెల్లమైన విషయం తెలిసిందే. అయినా కూడా లోక్‌సభలో తాము ప్రత్యేక హోదా కోసం పోరాడామంటూ గొప్పలు చెప్పుకునే యత్నాలు మళ్లీ మొదలుపెట్టే పనిలో టీడీపీ నేతలు బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ‘హోదా వద్దు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారు, అనంతరం ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆపై ఎన్నికల సమయం వచ్చేసరికి యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందని’అవిశ్వాసంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ సాక్షిగా ఏపీ సీఎం నిజ స్వరూపాన్ని బయటపెట్టగా వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. ఏపీకి తాము ఎన్నో చేయాలని చూసినా బీజేపీ వల్లే అది సాధ్యపడటం లేదన్న తరహాలో చంద్రబాబు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నేనే ఎక్కడా యూటర్న్‌ తీసుకోలేదు. ప్రధాని మోదీనే ప్రస్తుతం యూటర్న్‌ తీసుకున్నారు. మోదీ మమ్మల్ని అవమానించారు. గతంలో ప్రధాని అయ్యేందుకు అవకాశం వచ్చినా వదులుకున్నాను. అభివృద్ధి ఎలా చేయాలో నాకు తెలుసు. గత నాలుగేళ్లు మోదీతో కలిసి పనిచేశాను. ఇప్పుడు ఆయన వైఖరిని వ్యతిరేకిస్తున్నా. ఆయన నాకు మిత్రుడు కాదు.. శత్రువు కాదు. నా శ్రేయోభిలాషి ఎంతమాత్రం కాదు. అవిశ్వాస తీర్మానంపై మోదీ వద్ద సమాధానం లేదని తెలుసు. కేవలం 1500 కోట్ల రూపాయలతో రాజధాని కాదుకదా.. ఎలక్ట్రికల్‌ కేబుల్‌ పనులు కూడా చేయలేం. విభజన చట్టం అమలు చేస్తామని గతంలో మోదీ హామీ ఇచ్చారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం సరికాదు, ముందు మీరేం చేశారో చెప్పండి. ఏపీకి ఇచ్చిన హామీల అమలు బాధ్యత ప్రధానికి లేదా’ అని మోదీని చంద్రబాబు ప్రశ్నించారు.

నాకు అన్నీ తెలుసు
అందరి కంటే రాజకీయాలు నాకే ఎక్కువ తెలుసు. నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసిన ఘనత నాదే. జాతీయస్థాయిలో చక్రం తిప్పాం. భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా ఎంపీలు రాజీనామాలు ఎందుకు చేయాలి. కడప స్టీల్‌ ప్లాంట్‌ గురించి అడుగుతున్నారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించే ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. మా ఎంపీలు రాజీనామా చేస్తే మన గొంతుక వినిపించడం ఎలా సాధ్యమవుతుంది. అసలే బీజేపీని నమ్మే పరిస్థితులు లేవని చంద్రబాబు అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా