హైటెక్‌ సిటీ ప్రారంభించింది ఆయనే!

17 Aug, 2018 09:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశసేవ కోసమే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి.. భరతమాత ముద్దుబిడ్డ.. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం అనంత లోకాలకు వెళ్లిపోయారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన విలువల కోసమే పోరాడిన యోధుడతను. వాజ్‌పేయికి అన్ని రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల నేతలు, ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగేవి. దేశ ప్రధానిగా వాజ్‌పేయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉండేది. ప్రధానిగా హోదాలో ఆయన నాలుగు సార్లు హైదరాబాద్‌ సందర్శించారు. నగరానికి ఐటీ హబ్‌గా ఉన్న హైటెక్‌ సిటీ(సైబర్‌ టవర్స్‌)ని 1998లో వాజ్‌పేయినే ప్రారంభించారు.  ప్రతిష్ఠాత్మక ఈ సిటీ ప్రారంభోత్సవానికి వాజ్‌పేయి ముఖ్యఅతిథిగా రావడం ఎంతో గర్వకారణం. హైటెక్‌ సిటీనే మన హైదరాబాద్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఐటీ సౌకర్యం. హైటెక్‌ సిటీ మైక్రోసాఫ్ట్‌, జీఈ, ఒరాకిల్‌ వంటి అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు మెట్టునిల్లుగా ఉంటుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా(1980-86) కొనసాగిన సమయంలో వాజ్‌పేయి టాక్సీలో వచ్చి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. కర్ణాటకకు వెళుతూ ఆయన బేగంపేట విమానాశ్రయంలో ఆగారు. ఆ సమయంలో హెగ్డేవార్‌ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకుని నేరుగా టాక్సీ తీసుకుని, ఆ ఉత్సవానికి వచ్చారు.

ఎన్నికల సమయంలో, ఎమర్జెన్సీ కాలంలో, ప్రధాన మంత్రిగా నగరంలో జరిగిన పలు బహిరంగ సమావేశాలకు వాజ్‌పేయి హాజరయ్యారని బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు. పేదలకు నివాస యోగ్యం కల్పించేందుకు ఏర్పాటుచేసిన పథకం వాంబే స్కీమ్‌(వాల్మికి అంబేద్కర్‌ ఆవాస్‌ యోజన)ను ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే లాంచ్‌ చేశారు. ఆ పథకాన్ని లాంచ్‌ చేసిన అనంతరం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు కూడా ఆయనే శంకుస్థాపన చేశారు. అంతేకాక 2000 జూన్‌లో  హైదరాబాద్‌లోని ప్రముఖ బసవతారక ఇండో-అమెరికన్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, రీసెర్చి సెంటర్‌ ప్రారంభోత్సవానికి హాజరై వాజ్‌పేయి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2004లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా వాజ్‌పేయి హాజరయ్యారు. 

అంతకుముందు 1984లో వాజ్‌పేయి రెండుసార్లు హైదరాబాద్‌ వచ్చారు. అదీ ఎన్టీఆర్‌కు మద్దతుగా. తన ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు నిరసనగా ఎన్టీఆర్‌ అప్పట్లో నిరసనకు దిగగా, వాజ్‌పేయి అండగా నిలిచారు. ఎన్టీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి కాగా.. ప్రమాణస్వీకారానికి వాజ్‌పేయి హాజరయ్యారు. హైదరాబాద్‌తో పాటు, ఏపీలోని గుంటూరు నగరాన్ని కూడా వాజ్‌పేయి పలుసార్లు సందర్శించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన పలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. వాజ్‌పేయి జన్‌ సంఘ్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, గుంటూరుకు చెందిన అడ్వకేట్ జూపూడి యజ్ఞ నారాయణ జన్‌ సంఘ్‌కు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో నారాయణ కుటుంబ సభ్యులకు, వాజ్‌పేయి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూ గుంటూరు వచ్చినా.. నారాయణ ఇంటికి వెళ్లేవారు. నారాయణ ఎంఎల్‌ఏగా పోటీచేసినప్పుడు, వాజ్‌పేయి ఆయన మద్దతుగా పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇలా పలువురు బీజేపీ నాయకులకు మద్దతుగా వాజ్‌పేయి ప్రచారాల్లో పాల్గొనేవారు కూడా. గుంటూరులో జిన్నా టవర్‌ నుంచి బీఆర్‌ స్టేడియంకు వెళ్లే వీరసవకార్‌ రోడ్డును వాజ్‌పేయినే ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు