రెండు మిస్సైల్స్‌ ఢీకొట్టుకోవడం చూశారా..

30 Dec, 2017 09:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్టార్‌ వార్స్‌ మూవీ చూశారా.. అందులో ఓ మిసైల్‌ను మరో మిసైల్‌ ఢీకొట్టుకుంటుంటాయి. ఆ సమయంలో మనకు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. అచ్చం అలాంటి సీనే సినిమాలో కాకుండా నిజజీవితంలో దర్శనం ఇస్తే.. అవును అదెక్కడో కాదు.. మన దేశంలోనే చోటు చేసుకుంది. గురువారం నిర్వహించిన శత్రు క్షిపణిని ఢీకొట్టే పరీక్ష విజయవంతమైంది. పై నుంచి వచ్చే శత్రు క్షిపణిని మరో క్షిపణితో కిందనున్న రాడార్ల సాయంతో సరాసరిగా ఢీకొట్టించారు. దానికి సంబంధించిన ఫుటేజీ ఇప్పుడు బయటకు వచ్చింది.

సాధారణంగా పాకిస్థాన్‌ మద్యంతర శ్రేణి క్షిపణులను ఎక్కువగా పరీక్షిస్తుంటుంది. వీటితో భారత్‌పై దాడి చేయాలని దాని వ్యూహం. అయితే, వాటిని నేరుగా ఢీకొట్టే లక్షిత క్షిపణులు ఇప్పటి వరకు భారత ఆర్మీ వద్ద లేవు. దీంతో తాజాగా తొలుత ఓ క్షిపణిని ప్రయోగించి దానిని మరో బాలిస్టిక్‌ క్షిపణితో విజయవంతంగా ఢీకొట్టించారు. గురువారం ఉదయం 9.45నిమిషాలకు ఇది పూర్తి చేశారు. కింద ఉండే రాడార్లు సిగ్నల్‌ ఇవ్వడం ద్వారా శత్రు క్షిపణిపైకి దూసుకెళ్లే క్షిపణి తనను తాను యాక్టివేట్‌ చేసుకొని నేరుగా ఓ బుల్లెట్‌ను మరో బుల్లెట్‌ ఢీకొట్టినట్లుగా ఢీకొడుతుంది. ఇది తొమ్మిదో పరీక్ష. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పాక్‌ నుంచి వచ్చే ఎలాంటి క్షిపణినైనా భారత్‌ మధ్యలోనే నిలువరించగలుగుతుంది.

మరిన్ని వార్తలు