ప్రధాని ఎప్పుడూ ఇక్కడే ఉండాలంటే ఎలా?

12 Dec, 2016 15:06 IST|Sakshi
ప్రధాని ఎప్పుడూ ఇక్కడే ఉండాలంటే ఎలా?
పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చ పదే పదే వాయిదాలతో సరిపోయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా మొదటి రెండు మూడు రోజులు అసలు సభా కార్యకలాపాలే సక్రమంగా సాగలేదు. గురువారం రాజ్యసభలో చర్చకు అనుమతించడంతో.. అది మొదలైనా, అధికార.. ప్రతిపక్షాల వాగ్వాదంతో వాయిదాల పర్వం కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సభ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష నేతలు సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజాద్ ప్రధానమంత్రి సభలో ఎందుకు లేరని ప్రశ్నించారు. సమయం చాలా అయ్యిందని, అందువల్ల ఆయన వస్తే చర్చ విని దానికి సమాధానం ఇస్తే బాగుంటుందని సీతారాం ఏచూరి సూచించారు. ప్రధాని కేవలం ప్రశ్నోత్తరాల సమయం కోసమే వచ్చారా.. అలాగైతే చర్చ జరగదని, చర్చకోసం వస్తే ఇప్పుడు కూడా ఉండాలని గులాం నబీ ఆజాద్ అన్నారు. చర్చ మొదలైనప్పుడు వచ్చి, తర్వాత వెళ్లిపోయారని.. ఆయన వస్తే తప్ప సభను నడవనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
ఈ సమయంలో జోక్యం చేసుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజీ కురియన్.. ప్రధానమంత్రి ఎప్పుడూ ఇక్కడే ఉండాలంటే కుదరదని చెప్పారు. ఆయన వస్తారని ప్రభుత్వం చెబుతోందని, అందువల్ల సభను సజావుగా నడవనివ్వాలని కోరారు. ఇప్పటికిప్పుడే ఆయన రావాలని మీరు అడగడం సరికాదని అన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వినలేదు. 
 
దాంతో సభాధ్యక్షుడు అరుణ్ జైట్లీని స్పష్టత ఇవ్వాల్సిందిగా కురియన్ కోరారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ... ''ప్రధానమంత్రి చర్చకు వస్తారా రారా అని ప్రతిపక్షం అడిగింది, ఆయన పాల్గొంటారని చెప్పాం. మాకు ఒక అనుమానం ఉంది.. అది నిజమని ఇప్పుడు అనిపిస్తోంది. ప్రతిపక్షం చర్చ నుంచి పారిపోవాలనుకుంటోంది. అందుకు కారణాలు వెతుక్కుంటోంది. ఇది ఓ కొత్త పద్ధతి. చర్చ మొదలైంది, కొనసాగుతోంది.. కొనసాగించండి. ప్రధానమంత్రి కూడా చర్చలో పాల్గొంటారు. అందులో అనుమానం ఏమీ లేదు. చర్చ కొనసాగినంత సేపూ ప్రధానమంత్రి పూర్తిగా సభలోనే ఉండటం ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. మేం మాత్రం చర్చను ఆపాలని అనుకోవడం లేదు. వాళ్లు అనుకుంటే వాళ్ల ఇష్టం'' అని అరుణ్ జైట్లీ మండిపడ్డారు. 
 
ఆయన సమాధానంతో ప్రతిపక్ష సభ్యులు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్రధానమంత్రి వచ్చి తీరాల్సిందేనని డిమాండు చేస్తూ, ప్రధానమంత్రి పారిపోయారని నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. 
>
మరిన్ని వార్తలు