అలా అయితే భరణం అవసరం లేదు..

22 Oct, 2018 10:08 IST|Sakshi

సాక్షి, ముంబై : భార్య సంపాదిస్తుంటే ఆమెకు తన భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని సెషన్స్‌ కోర్టు వెల్లడించింది. తన భార్యకు మెయింటెనెన్స్‌ కింద సొమ్ము ఇవ్వాలని మేజిస్ర్టేట్‌ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌పై ఎగువ కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. భార్యకు తగినంత ఆదాయ వనరులుంటే ఆమెకు మధ్యంతర మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కంది.

భార్యతో విడిపోయిన నలసపోరాకు చెందిన 35 సంవత్సరాల వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై సెషన్స్‌ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పీల్‌ చేసుకున్న వ్యక్తి బార్య నెలకు రూ 17,000 నుంచి రూ 18,000 వేతనం పొందుతున్నట్టు ఆమె వేతన సర్టిఫికెట్‌ వెల్లడిస్తోందని, అయితే ఆమెకు నెలకు రూ 6000 మెయింటెనెన్స్‌ చెల్లించాలని విఖ్రోలి మెట్రపాలిటన్‌ మేజిస్ర్టేట్‌ ఉత్తర్వులు జారీ చేసే క్రమంలో ఆమె ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోలేదని సెషన్స్‌ కోర్టు పేర్కొంది.

ప్రాధమిక ఆధారాల ప్రకారం ఆమెకు తగిన జీవనోపాధి ఉన్నందున మధ్యంతర నిర్వహణ ఖర్చులకు అర్హురాలు కాదని స్పష్టం చేసింది. అయితే పిల్లలకు చెల్లించాల్సిన రూ రెండు వేల మెయింటెనెన్స్‌ ఉత్తర్వులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని సెషన్స్‌ కోర్టు తెలిపింది. కాగా, భార్య సంపాదనాపరురాలైతే ఆమెకు భర్త జీతంలో నుంచి భరణం చెల్లించనవసరం లేదని గతంలోనూ పలు కోర్టులు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు