తాంత్రికుడిని కలిశా.. మాట్లాడి వచ్చేశా

29 Oct, 2015 10:38 IST|Sakshi
తాంత్రికుడిని కలిశా.. మాట్లాడి వచ్చేశా

ఓ తాంత్రికుడిని కలిశారంటూ వచ్చిన వివాదంపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివరణ ఇచ్చారు. తాను తాంత్రికుడిని కలిసిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. తనను కలవాలని ఆ తాంత్రికుడు కోరినట్లు తమ సహచరుడు ఒకరు చెప్పారని, అలాగే కలుద్దాం అన్నామని నితీష్ చెప్పారు. అయితే ఇదంతా దాదాపు ఏడాదిన్నర క్రితం విషయమని ఆయన అన్నారు. తాను తాంత్రికుడిని కలిశానని, ఆయన చెప్పిన మాటలు విని వచ్చేశానని తెలిపారు. ఇలాంటి విషయాలు చూపించి వాళ్లు ఏం నిరూపించదలచుకున్నారని ప్రశ్నించారు. మోదీ ఎవరెవరిని కలుస్తున్నారో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని చెప్పారు. తాను ఏ విషయమూ ఎప్పుడూ దాచలేదన్నారు. ఈ చిన్న విషయానికి వాళ్లు మంత్ర తంత్రాలను జోడిస్తున్నారని, వాళ్లు మంత్ర తంత్రాలకు దూరంగా ఉండేవాళ్లే అయితే.. సాధువులను ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు.

ఇవన్నీ నీచ రాజకీయ ట్రిక్కులేనని, ఈ స్టింగ్ ఆపరేషన్‌లో ఉన్న వ్యక్తి మీద వెంటనే చర్య తీసుకుంటామని నితీష్ కుమార్ తెలిపారు. వాళ్లు వ్యాపం, లలిత్ గేట్ లాంటి అంశాలపై నోరు మెదపలేదని, దానివల్లే పార్లమెంటు సమావేశాలు జరగకుండా పోయాయని ఎద్దేవా చేశారు. జితన్ రామ్ మాంఝీని సీఎం చేసినప్పుడు ఆయనను విమర్శించారని, అదే ఆయనను పదవి నుంచి దించేస్తే, మహాదళితుడికి అవమానం జరిగిందని అంఉటన్నారని, దాన్నిబట్టి బీజేపీ వాళ్లకు నైతిక విలువలు లేదన్న విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

తాము బీజేపీతో 17 ఏళ్ల పాటు కలిసున్నామని, కానీ వాళ్లు కొత్త అవతారంలో వచ్చేసరికి విడిపోవాలని నిర్ణయించుకున్నామని అన్నారు. మోదీ ప్రధాని అయిన 14 నెలల తర్వాత బిహార్ రాష్ట్రానికి వచ్చారని, అప్పుడు తాను ఆయనకు స్వాగతం పలికానని నితీష్ చెప్పారు. కానీ తర్వాత ఆయన ముజఫర్‌పూర్ వెళ్లి తన డీఎన్ఏ గురించి కామెంట్లు చేశారన్నారు.

మరిన్ని వార్తలు