ఇటలీలో పుట్టినా.. ఈ మట్టిలోనే కలిసిపోతా!

10 May, 2016 19:40 IST|Sakshi
ఇటలీలో పుట్టినా.. ఈ మట్టిలోనే కలిసిపోతా!

తిరువనంతపురం: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ సోనియాగాంధీకి ఇటలీతో సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన విమర్శలకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి దీటుగా బదులిచ్చారు. 'నా నిజాయితీని సవాల్ చేస్తూ మోదీ ఎంతకైనా దిగజారొచ్చు. కానీ, భారత్‌ పట్ల నాకు చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నాయన్న సత్యాన్ని ఆయన ఏనాడూ మరుగుపరుచలేరు' అని సోనియా పేర్కొన్నారు.

తిరువనంతపురంలో మంగళవారం జరిగిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగిస్తూ. 'ఔను, నేను ఇటలీలోనే పుట్టాను. 1968లో ఇందిరాగాంధీ కోడలిగా నేను భారత్‌లో అడుగుపెట్టాను. 48 ఏళ్లు నేను భారత్‌లోనే గడిపాను. ఇది నా ఇల్లు. ఇది నా దేశం. ఈ 48 ఏళ్ల కాలమంతా బీజేపీ, ఆరెస్సెస్‌, ఇతర పార్టీలు పుట్టుక విషయమై నన్ను విమర్శిస్తూ సిగ్గుపడేలా చేద్దామనుకుంటున్నారు. నిజాయితీపరులైన తల్లిదండ్రులకు నేను పుట్టానని గర్వంగా చెప్తాను. వారి గురించి నేనెప్పుడూ సిగ్గుపడను. ఔను, నాకు ఇటలీలో బంధువులు ఉన్నారు. 93 ఏళ్ల నా తల్లి, ఇద్దరు చెల్లెళ్లు అక్కడే ఉన్నారు' అని సోనియా పేర్కొన్నారు.

'ఇక్కడే, ఈ గడ్డమీదనే నేను తుదిశ్వాస వదులుతాను. ఇక్కడే నా ఆస్తికలు నా ఆప్తులతో కలిసిపోతాయి. ఈ ఆత్మీయ భావనను ప్రధాని అర్థం చేసుకుంటారని నేను భావించను. కానీ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను' అని సోనియా భావోద్వేగంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు