రాజస్తాన్‌లో కుప్పకూలిన మిగ్‌-21 విమానం

8 Mar, 2019 15:51 IST|Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లో భారత యుద్ధ విమానం మిగ్‌-21 కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో పైలట్‌ విమానం నుంచి ఎజెక్ట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పైలట్‌ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. బికనీర్‌కు సమీపంలో ఉన్న శోభా సర్‌కీ ధానీ ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బికనీర్‌ ఎస్పీ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల నేపథ్యంలో భారత్‌- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో యుద్ధ విమానం కూలిపోవడంతో అలజడి రేగింది. అయితే రాజస్తాన్‌లోని నాల్‌ ఎయిర్‌బేస్‌కు మిగ్‌-21ను ఐఏఎఫ్‌ తరలిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న 12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌ను ఐఏఎఫ్‌ విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకు ప్రతిగా పాక్‌ వైమానిక దళం తిరిగి దాడికి ప్రయత్నించగా వారిని ఎదిరించే క్రమంలో భారత పైలట్‌ అభినందన్‌ ఆ దేశ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు