Karni Sena Chief Murder Case: రాజస్థాన్‌ బంద్‌.. నాలుగు జిల్లాల్లో హైఅలర్ట్‌

6 Dec, 2023 09:25 IST|Sakshi

జైపూర్‌: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ దారుణ హత్య నేపథ్యంలో రాజస్థాన్‌ అట్టుడుకుతోంది. హత్యకు నిరసనగా సుఖ్‌దేవ్ సింగ్ మద్దతుదారులు బుధవారం రాజస్థాన్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఘటన విషయం గురించి తెలియగానే పెద్ద ఎత్తున రాజ్‌పుత్ సామాజిక వర్గం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చురు, ఉదయ్‌పూర్, అల్వార్, జోధ్‌పూర్ జిల్లాల్లోనూ నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. 

అయితే, సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ పట్టపగలే దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. రాజధాని జైపుర్‌లోని శ్యామ్‌నగర్‌లో ఆయన నివాసంలోనే గోగామేడీ హత్యకు గురయ్యారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సుఖ్‌దేవ్‌ నివాసానికి వెళ్లి దారుణానికి పాల్పడ్డారు. గోగామేడీతో మాట్లాడాల్సి ఉందని భద్రతా సిబ్బందికి చెప్పి లోపలికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. 

మరోవైపు.. రాజస్థాన్‌లో ఉద్రికత్తలపై డీజీపీ ఉమేశ్‌ మిశ్రా స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. నేరస్థుల రహస్య స్థావరాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. నేరుస్తులను వదిలిపెట్టమని హామీ ఇచ్చారు. ఇక, దుండగుల్లో ఒకడైన నవీన్‌ షెకావత్‌‌ను సుఖ్‌దేవ్ సింగ్ సహచరులు కాల్చి చంపారు. గోగామేడీ భద్రతా సిబ్బంది కాల్పుల్లో నవీన్‌ చనిపోయినట్టు జైపుర్‌ పోలీస్‌ కమిషనర్‌ బిజు జార్జ్‌ జోసెఫ్‌ వెల్లడించారు. అయితే, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే హత్య జరగడం కలకలం సృష్టించింది. 

>
మరిన్ని వార్తలు