Karni Sena Chief Murder: కర్ణిసేన చీఫ్‌ హత్య..గెహ్లాట్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు!

6 Dec, 2023 08:27 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ గొగామెడి హత్యపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగిన ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఓటమికి ప్రతీకారంగానే కాంగ్రెస్‌ పార్టీ ఈ హత్యకు పాల్పడినట్లుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్‌ గెహ్లాట్‌ కావాలనే సుఖ్‌దేవ్‌ భద్రత తగ్గించారని, ఇదే ఈ హత్య జరిగేందుకు కారణమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సుఖ్‌దేవ్‌కు ప్రాణాపాయం ఉందని పోలీసులకు సమాచారం ఉండి కూడా భద్రత తగ్గించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాల ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లో కర్ణిసేన బీజేపీకి మద్దతిచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.  

బైక్‌ మీద వచ్చిన ముగ్గురు దుండగులు మంగళవారం ఉదయం సుఖ్‌దేవ్‌ను ఆయన ఇంట్లోనే కాల్చి చంపారు. ఈ హత్య ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సోషల్‌ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. కాల్పులు జరిపిన వారిలో ఒక దుండగుడు అతని సహచరుల కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సుఖ్‌దేవ్‌ సెక్యూరిటీ గార్డు కాల్పుల్లో దుండగుడు చనిపోలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. 

ఇదీచదవండి..‘ఎక్స్‌’లో హాట్‌టాపిక్‌గా దోశ ధర..!

    


 

>
మరిన్ని వార్తలు