ఇండియా కూటమి భేటి మళ్లీ వాయిదా

10 Dec, 2023 20:44 IST|Sakshi

ఢిల్లీ: ఇండియా కూటమి భేటీ మళ్లీ వాయిదా పడింది. డిసెంబర్ 17న నిర్ణయించిన సమావేశాన్ని డిసెంబర్ 19కి వాయిదా వేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన బయటకు వెళ్లడించలేదు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో వెంటనే డిసెంబర్ 6న ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చింది. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అగ్రనేతలు రాలేమని స్పష్టం చేశారు. దీంతో సమావేశాన్ని డిసెంబర్ 17కి వాయిదా వేశారు.   

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ప్రస్తుతం ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. ప్రాంతీయ పార్టీల పొత్తుతో   భాగస్వామిగా బీహార్, జార్ఖండ్‌లలో అధికారంలో ఉంది. దేశం మొత్తంలో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌లో మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉంది. 

బీజేపీని గద్దే దించే ధ్యేయంతో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. పాట్నాలో మొదటిసారి సమావేశమయ్యారు. అనంతరం బెంగళూరు, ముంబయితో కలిపి ఇప్పటికి మూడు సమావేశాలు జరిగాయి. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 

ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి


 

>
మరిన్ని వార్తలు