పాక్‌లో నేడు ‘కర్తార్‌పూర్‌’కు శంకుస్థాపన

28 Nov, 2018 10:03 IST|Sakshi

ఇస్లామాబాద్‌ ‌: సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌కు పాకిస్తాన్‌లోని నరోవాల్‌ జిల్లా శాఖర్‌గఢ్‌ వద్ద పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈరోజు(బుధవారం) శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌లను పాక్‌ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సుష్మ, అమరీందర్‌ సింగ్‌లు ఆహ్వానాన్ని తిరస్కరించగా సిద్ధూ మాత్రం విలేకరులతో కలిసి మంగళవారమే పాక్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌- పాక్‌ల మధ్య శత్రుత్వాన్ని రూపుమాపేందుకు కర్తార్‌పూర్‌ కారిడార్‌ తోడ్పడుతుందని పేర్కొన్నారు.

కాగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ శంకుస్థాపన కోసం సిద్ధు పాకిస్తాన్‌కు వెళ్లడంతో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై స్పందించిన పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ... పాక్‌ పర్యటనను మానుకోవాల్సిందిగా సిద్ధూను కోరాననీ, అయితే అక్కడికి వెళ్లడానికే నిర్ణయించుకున్నట్లు సిద్ధూ తనకు చెప్పారని పేర్కొన్నారు.  వ్యక్తిగతంగా ఆయన అలా వెళ్తున్నప్పుడు ఆపడం భావ్యం కాదేమోనని ఆగిపోయానన్నారు.

ఇక భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గురుదాస్‌పూర్‌ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్‌ సాహిబ్‌ను, పాక్‌లో ఉన్న కర్తార్‌పూర్‌ దర్బార్‌ సాహిబ్‌ను కలుపుతూ ఇరు దేశాలూ కర్తార్పూర్‌ కారిడార్‌ నిర్మిస్తుంచనున్న విషయం తెలిసిందే. పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు మొత్తం 2 కిలో మీటర్ల దూరాన్ని భారత్‌ నిర్మించేందుకు సోమవారమే శంకుస్థాపన జరగ్గా, పాక్‌ వైపునా రెండు కిలో మీటర్ల రోడ్డు నిర్మాణ పనులను ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలు