బంధం విస్తృతం

26 Jan, 2020 04:28 IST|Sakshi
బొల్సనారోతో మోదీ ఆలింగనం

15 ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్, బ్రెజిల్‌

న్యూఢిల్లీ: సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను విస్తృతం చేయడానికి భారత్, బ్రెజిల్‌ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. భారత ప్రధాని  మోదీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు జయిర్‌ బొల్సనారో సమక్షంలో శనివారం రెండు దేశాల అధికారులు ఈ మేరకు 15 ఒప్పందాలపై సంతకాలు చేశారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, పౌరవిమానయానం, ఇంధన, ఆరోగ్యం, పరిశోధన రంగాల్లో మరింతగా సహకరించుకునేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేసేందుకు అంగీకరించాయి.  ‘మీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది’ అని బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారోతో చర్చల అనంతరం మోదీ పేర్కొన్నారు.

భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో బ్రెజిల్‌ను కీలకమైన భాగస్వామిగా ఆయన వర్ణించారు. ఇప్పటికే బలంగా ఉన్న రెండు దేశాల సంబంధాలు తాజాగా కుదిరిన ఒప్పందాలతో మరింత దృఢమవుతాయని బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారో పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొననున్న జయిర్‌ బొల్సనారో తన కూతురు లారా, కోడలు లెటిసియా ఫిర్మోతోపాటు 8 మంది మంత్రులు, నలుగురు పార్లమెంట్‌ సభ్యులు, వాణిజ్య ప్రతినిధుల బృందంతో శుక్రవారం వచ్చారు. భారత్‌ ఎగుమతుల్లో ప్రధానంగా రసాయనాలు, సింథటిక్‌ దారం, వాహన భాగాలు, పెట్రోలియం ఉత్పత్తులు అలాగే,  బ్రెజిల్‌ నుంచి ముడి చమురు, బంగారం, ఖనిజాలు దిగుమతి చేసుకుంటోంది.

మరిన్ని వార్తలు