డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేత

19 Oct, 2014 01:27 IST|Sakshi
డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేత

లీటర్‌కు రూ. 3.37 తగ్గిన ధర
శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి..
ఇకపై అంతర్జాతీయ ధరలకు తగ్గట్టు ధర
సహజవాయువు ధర 46 శాతం పెంపు
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు
 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గడం, చమురు కంపెనీలు లాభాల బాటలోకి ప్రవేశించడంతో డీజిల్ ధరలపై నియంత్రణను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. దీంతో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా లీటర్ డీజిల్‌పై రూ. 3.37 పైసలు ధర తగ్గింది. కొత్త ధర శనివారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు శనివారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ.. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించినట్టు చెప్పారు. దీనివల్ల సామాన్యులపై ఎటువంటి భారం పడబోదన్నారు. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తేయడంతో వచ్చే నెల నుంచి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా డీజిల్ ధరలు ఉండబోతున్నాయి. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 58.97 నుంచి రూ. 55.60కి తగ్గింది. హైదరాబాద్‌లో రూ. 64.27 నుంచి రూ. 60.60కు, వరంగల్‌లో రూ. 63.90 నుంచి రూ. 60.24 కు తగ్గింది.

ఐదేళ్లలో ఇదే తొలిసారి.. ఐదేళ్ల కాలంలో డీజిల్ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. ఆఖరిసారిగా 2009 జనవరి 29న డీజిల్ ధరను రూ. 2 మేరకు ప్రభుత్వం తగ్గించింది. ఈ ఏడాది సెప్టెంబర్1న చివరిసారిగా డీజిల్ ధరను 50 పైసల చొప్పున పెంచారు. 2013 జనవరి నుంచి ఇప్పటి వరకూ 19 సార్లు డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోవడంతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర సుమారు 25 శాతం తగ్గి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లకు పరిమితమైంది. ఇప్పట్లో ఇది వంద డాలర్లను దాటే అవకాశం లేదని పరిశ్రమ వర్గాల అంచనా. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. గత ఏడాది జనవరిలో ప్రతినెలా 50 పైసల చొప్పున డీజిల్ ధరను పెంచాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఐదు సార్లు పెట్రోల్ ధరలు తగ్గాయి. దీంతో రెండు నెలల్లోనే పెట్రోల్ ధర రూ. 7 మేరకు తగ్గింది. డీజిల్ విషయానికి వస్తే సెప్టెంబర్ రెండో వారం నాటికే కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. లీటర్‌కు రూ. 3.56 చొప్పున డీజిల్‌పై లాభాలను ఆర్జిస్తున్నాయి. తాజాగా డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేయడంతో ఇకపై ప్రభుత్వం లేదా ప్రభుత్వ  చమురు సంస్థలు డీజిల్‌పై ఎలాంటి సబ్సిడీని అందించవు. డీజిల్ ధరల నుంచి చమురు కంపెనీలకు ఉపశమనం లభించినా కిరోసిన్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై మాత్రం నష్టాలు కొనసాగుతున్నాయి. లీటర్ కిరోసిన్‌పై రూ. 31.22, 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 404.64 చొప్పున కంపెనీలు నష్టపోతునున్నాయి.

పెరిగిన సహజవాయువు ధర...మరోవైపు సహజవాయువు ధరను 46 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 4.2 డాలర్లుగా ఉన్న సహజవాయువు ధర నవంబర్ 1 నుంచి 6.17 డాలర్లకు చేరనుంది. ఈ గ్యాస్ ధరను రెట్టింపు చేయాలన్న రంగరాజన్ కమిటీ సిఫార్సుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆమోదించినా ఎన్‌డీఏ ప్రభుత్వం పక్కన పెట్టి, కొత్త ఫార్ములా కింద ధర నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ, ముఖేష్ అంబాని నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షించనుంది. దీనిపై తదుపరి సమీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 1న చేపడుతుంది.

సహజవాయువు ధరను పెంచడంతో సీఎన్‌జీ ధర కేజీకి రూ. 4.25 చొప్పున, పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే వంట గ్యాస్ ధర రూ. 2.60 చొప్పున పెరగనుంది.  కాగా గ్యాస్ ఆధారిత విద్యుత్, ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. కేజీ డీ6లోని ధీరుబాయ్ అంబానీ 1, 3 గ్యాస్ ఫీల్డ్స్‌లో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున ఆర్‌ఐఎల్ కొత్త గ్యాస్ ధరను పొందలేదు. ఆర్‌ఐఎల్ కస్టమర్లు కొత్త ధరను చెల్లించినా.. ఆర్‌ఐఎల్‌కు 4.2 డాలర్లు మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని గెయిల్ నేతృత్వంలోని గ్యాస్ పూల్ ఖాతాలో జమ చేస్తారు. నిబంధనల మేరకు గ్యాస్‌ను ఉత్పత్తి చేసిన తర్వాత మాత్రమే ఆర్‌ఐఎల్ కొత్త ధరను పొందగలుగుతుంది.మరోవైపు ఢిల్లీలోని ప్రభుత్వ భవనాలను స్మారక చిహ్నాలుగా మార్చరాదని కేంద్రం నిర్ణయించింది. ఆర్‌ఎల్‌డీ చీఫ్ అజిత్‌సింగ్ తన తండ్రి, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ నివసించిన బంగళాను స్మారక చిహ్నంగా మార్చాలని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ జయంతి, వ ర్ధంతి వేడుకలను ఇకపై కేంద్రమే నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
 
మళ్లీ నగదు బదిలీ..
 
యూపీఏ హయాంలో అమలు చేసిన వంట గ్యాస్‌కు నగదు బదిలీని తిరిగి అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకూ దేశంలోని 54 జిల్లాల్లో వంట గ్యాస్‌కు నగదు బదిలీని అమలు చేయనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. పాత పథకంలో ఉన్న లోపాలను సవరించి తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు. ఆధార్‌కార్డు లేకపోయినా బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరికీ నేరుగా నగదు బదిలీ చేస్తామని జైట్లీ చెప్పారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేని వారికి మాత్రం కొంత కాలం పాటు పాత పద్ధతిలోనే గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు. వంట గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. జనధన యోజన పథకం కింద ఇప్పటి వరకూ 6.02 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించినట్టు చెప్పారు.
 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా