స్మార్ట్ సిటీగా వారణాసి అభివృద్ధి

31 Aug, 2014 01:07 IST|Sakshi
స్మార్ట్ సిటీగా వారణాసి అభివృద్ధి

* అవగాహన ఒప్పందంపై భారత్-జపాన్ సంతకాలు
* కీలక ఘట్టంతో మొదలైన ప్రధాని మోడీ జపాన్ పర్యటన

 
క్యోటో: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు రోజుల జపాన్ పర్యటనను కీలక ఘట్టంతో ప్రారంభించారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న బృహత్తర కార్యాచరణకు తన నియోజకవర్గమైన వారణాసితో శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం క్యోటో చేరుకున్న మోడీ... వారణాసిని క్యోటో తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా ఆ దేశంతో అవగాహన ఒప్పందం (క్యోటో పార్ట్‌నర్ సిటీ అగ్రిమెంట్) కుదుర్చుకున్నారు. సంస్కృతీ సంప్రదాయాలు, ఆధునిక హంగుల కలబోతగా ఉన్న క్యోటో నగరం.... వారణాసిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందించనుంది.
 
ఈ ఒప్పందంపై జపాన్‌లోని భారత రాయబారి దీపా వాధ్వా, క్యోటో నగర మేయర్ దైసాకు కదోకవాలు సంతకాలు చేశారు. మోడీని కలిసేందుకు ప్రత్యేకంగా క్యోటోకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే...ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 2 వేల ఆలయాలతో జపాన్ సాంస్కృతిక రాజధానిగా దాదాపు 1,000 ఏళ్లపాటు విరాజిల్లిన క్యోటో నగరం దాన్ని కాపాడుకుంటూనే ఆధునిక నగరంగా ఎలా ఎదిగిందో క్యోటో మేయర్ దైసాకు ఆదివారం మోడీకి ప్రత్యేకంగా వివరించనున్నారు. అంతకుముందు ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి క్యోటో చేరుకున్న మోడీని షింజో అబే గెస్ట్‌హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా అబేకు మోడీ స్వామి వివేకానంద పుస్తకాలను, భగవద్గీత ప్రతిని అందజేశారు.
 
ఎప్పుడూ కుర్తా పైజామాలో కనిపించే మోడీ నల్లటి బంధ్‌గాలా సూట్‌లో దర్శనమిచ్చి చూపరులను ఆకట్టుకున్నారు. అవగాహన ఒప్పందం కుదిరిన అనంతరం మోడీ గౌరవార్థం షింజో అబే విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం గురించి వారు చర్చించారు. విందుకు ముందు వారిద్దరూ ఓ చెరువు వద్దకు వెళ్లి చేపలకు ఆహారం అందించే సంప్రదాయ వేడుకలో పాల్గొన్నారు. సోమవారం టోక్యోలో జరగనున్న ఇరు దేశాల సదస్సులో మోడీ, అబేలు మళ్లీ భేటీకానున్నారు. మోడీ కోసం అబే సోమవారం ప్రత్యేకంగా తేనీరు (టీ) అందించనున్నారు. కాగా, మోడీ వెంట జపాన్ పర్యటనలో పాల్గొనాల్సిన భారత పారిశ్రామిక బృందం నుంచి ముకేశ్ అంబానీ తప్పుకున్నారు. దీనికి కారణం తెలియరాలేదు.

మరిన్ని వార్తలు