అర్జన్‌ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు

19 Sep, 2017 03:00 IST|Sakshi
అర్జన్‌ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు

►  యుద్ధ విమానాలతో ‘ఫ్లై పాస్ట్‌’
►  అధికార లాంఛనాలతో అంత్యక్రియలు


న్యూఢిల్లీ:  యుద్ధ వీరుడు, మార్షల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అర్జన్‌ సింగ్‌(98)కు జాతి కన్నీటి వీడ్కోలు పలికింది. కంటోన్మెంట్‌ ప్రాంతంలోని బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో సోమవారం సిక్కు సంప్రదాయం ప్రకారం, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. అర్జన్‌ సింగ్‌ కుమారుడు అరవింద్‌ ఆయన భౌతికకాయానికి తలకొరివి పెట్టారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేశారు.

 రాజకీయ ప్రముఖులు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గుండెపోటుతో శనివారం తుది శ్వాస విడిచిన అర్జన్‌సింగ్‌ భౌతిక కాయానికి తొలుత 17 తుపాకులతో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. యుద్ధ వీరుడికి గౌరవ సూచకంగా ‘మిస్సింగ్‌ మ్యాన్‌ ఫార్మేషన్‌’లో ఐఏఎఫ్‌ సుఖోయ్‌ ఎస్‌యూ–30 యుద్ధ విమానాలు గగనతలంలో సైనిక విన్యాసాలు (ఫ్లై పాస్ట్‌)నిర్వహించాయి. ఐఏఎఫ్‌ ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లు కూడా అర్జన్‌ సింగ్‌కు నివాళిగా వీఐసీ ఆకారంలో విన్యాసాలు నిర్వహించాయి.

  అమరుడైన సైనికాధికారి గౌరవార్థం ఆకాశంలో యుద్ధ విమానాలతో నిర్వహించేదే ‘మిస్సింగ్‌ మ్యాన్‌ ఫార్మేషన్‌’. అంతకుముందు జాతీయ పతాకం కప్పిన సింగ్‌ పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి మిలిటరీ వాహనంలో బ్రార్‌ స్క్వేర్‌కు తరలించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులతో పాటు త్రివిధ దళాల ప్రస్తుత, మాజీ అధిపతులు, సింగ్‌ కుటుంబ సభ్యులు సైనిక వీరుడికి కడసారి నివాళులర్పించారు.  

ధీశాలి.. తిరుగులేని పైలట్‌...  
వాయుసేనలో ఫైవ్‌స్టార్‌ ర్యాంక్‌ పొందిన ఏకైక అధికారి అర్జన్‌సింగ్‌ 1965 భారత్‌–పాక్‌ యుద్ధంలో వీరోచిత పాత్ర పోషించారు. చిన్న వయసులోనే యుద్ధంలో వైమానిక దళాన్ని ముందుండి నడిపించిన ఆయన సేవలను పలువురు కీర్తించారు. నాడు అమెరికా మద్దతు కలిగిన వైమానిక దళాలున్న పాక్‌ను సింగ్‌ నేతృత్వంలోని ఐఏఎఫ్‌ తరిమికొట్టిందని మాజీ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ కపిల్‌ కాక్‌ కొనియాడారు. ధైర్యవంతుడు, తిరుగులేని పైలట్‌ అని ఆయన మాజీ సహచరుడొకరు ప్రశంసించారు.

మరిన్ని వార్తలు