రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు | Sakshi
Sakshi News home page

రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు

Published Tue, Sep 19 2017 1:45 AM

రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు - Sakshi

వ్యూహాత్మకంగా దక్కించుకున్న ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నేత 
 
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని 83.11 ఎకరాల భూములకు రెండవసారి నిర్వహించిన వేలంలో రూ.60.30 కోట్ల ధర పలికింది. ప్రభుత్వం సరైన ప్రచారం కల్పించక పోవడం, రిజిస్ట్రేషన్‌ చేసివ్వబోమంటూ బెదరగొట్టిన నేపథ్యంలో ప్రముఖ బిల్డర్స్‌ ఎవరూ వేలంలో పాల్గొనలేదు. ఏడాదిన్నర క్రితం ఈ భూములను కేవలం రూ.22.44 కోట్లకు కారుచౌకగా టీడీపీ పెద్దలు కొట్టేయాలనుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ పోరాటంతో సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు సోమవారం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బహిరంగ వేలం ప్రక్రియను నిర్వహించింది.

దాదాపు 3 గంటల పాటు సాగిన వేలం ప్రక్రియలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌ భాగస్వామి బద్వేలు శ్రీనివాసులురెడ్డి వ్యూహాత్మకంగా రూ.60.30 కోట్లకు పాడుకుని భూములు దక్కించుకున్నారు. ఇతను మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి అనుచరుడు. వేలం ప్రక్రియలో ఆరు సంస్థలు సీల్డు టెండర్లు దాఖలు చేయగా, రెండు సంస్థలు ఈ టెండర్ల విధానంలో బిడ్లు దాఖలు చేశాయి. వీరితో పాటు మరో ఎనిమిది మంది బిడ్డర్లు నేరుగా బహిరంగ వేలంలో పాల్గొన్నారు.   రూ.27.45 కోట్లతో వేలం మొదలు వేలం ప్రక్రియ రూ.27.45 కోట్ల నుంచి మొదలైంది. కనిష్టంగా రూ.5 లక్షల చొప్పున పెరుగుతూ రూ.60.30 కోట్ల వద్ద ముగిసింది. మొత్తం 186 విడతల్లో ధర పెరిగింది. బహిరంగ వేలం అనంతరం సీల్డు కవర్ల రూపంలో దాఖలైన బిడ్లు పరిశీలించగా, అందులో అత్యధికంగా రూ.54.90 కోట్లు కోట్‌ అయ్యింది.

ఆ తర్వాత ఈ టెండరు విధానంలో దాఖలైన రెండు బిడ్లు తెరవగా అత్యధికంగా రూ.28.27 కోట్లు నమోదైంది. దీంతో మూడు విధానాల్లో బహిరంగ వేలంలో సత్యనారాయణ బిల్డర్స్‌ భాగస్వామి శ్రీనివాసులురెడ్డి రూ.60.30 కోట్లతో మొదటి స్థానంలో, హైదరాబాద్‌కు చెందిన చదలవాడ లక్ష్మి రూ.60.25 కోట్ల ధరతో రెండో స్థానంలో అత్యధిక ధరతో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు.  ఏడాదిన్నర కిత్రం జరిగిన వేలం ప్రక్రియలో కేవలం రూ.22.44 కోట్లతో అత్యధిక బిడ్డరుగా నిలిచిన కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ సహచరుడు సంజీవరెడ్డి రెండో విడత వేలంలో రూ.54.15 కోట్ల వరకు పాడారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా వేలం ప్రక్రియలో పాల్గొన్న  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ.43 కోట్ల ధర వరకు భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతూ వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. 
 
వేలం వివరాలు సుప్రీంకోర్టుకు.. 
బహిరంగ వేలం వివరాలను ఒక నివేదికగా సుప్రీంకోర్టుకు అందజేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్‌ అనురాధ ప్రకటించారు. కోర్టు తదుపరి ఉత్తర్వులకు లోబడి  అత్యధిక బిడ్డరు వివరాలను  ప్రకటిస్తామని తెలియజేశారు. కోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా వేలం ప్రక్రియలో అత్యధిక బిడ్డరుగా నిలిచిన వారు నిబంధనలకు అనుగుణంగా 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు పాట ధర మొత్తంలో 50 శాతం అంటే 30.15 కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో రూ.60.25 కోట్ల ధరతో రెండో స్థానంలో నిలిచిన చదలవాడ లక్ష్మి అత్యధిక బిడ్డరుగా అర్హత పొందుతారని చెప్పారు.

Advertisement
Advertisement