కొలీజియంపై కేంద్రం పెత్తనమా..!

5 May, 2018 15:44 IST|Sakshi
సీజేఐ దీపక్‌ మిశ్రా

న్యాయవ్యవస్థ అటానమికి ఎసరు

సాక్షి, న్యూఢిల్లీ : ఐదుగురు సీనియర్‌ జడ్జీల సుప్రీం కోర్టు కొలీజియం మే 2వ తేదీ సాయంత్రం సమావేశమైంది. ఎజెండా ఏమిటంటే ఉత్తరాఖండ్‌ చీఫ్‌ జస్టిస్‌ కేఎం జోసఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించాలనే కొలీజియం సిఫారసును తిరిగి యధాతథంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించడం. అలా చేసి ఉన్నట్లయితే దాన్ని ఆమోదించడం మినహా కేంద్రానికి మరో గత్యంతరం ఉండేది కాదు. సుప్రీం కోర్టు తన స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకునేది. తద్వారా తన ఆధిక్యతను చాటుకునేది. అంతకన్నా ఏ కారణం లేకుండా కొలీజియం సిఫార్సును తిప్పి పంపిన కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పినట్లు ఉండేది.

ఆ రోజు కొలీజియం సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం తిప్పి పంపిన సిఫారసును యధాతథంగా మళ్లీ పంపించడం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాకు లేదనేది స్పష్టమైంది. అలాంటప్పుడు కేంద్రం కాదన్న జోసఫ్‌ పేరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయంగా మరొకరి పేరును కొలీజియం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలా జరుగకుండా సమావేశం వాయిదా పడిదంటే కొలీజియం సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయన్నమాట. అలాంటి సందర్భాల్లో మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అలా కూడా నిర్ణయం తీసుకోలేదంటే చీఫ్‌ జస్టిస్‌ మిశ్రా మినహా మిగతా ఎవరు కూడా ప్రభుత్వ నిర్ణయానికి అంగీకరించలేదని అర్థం అవుతుంది. చీఫ్‌ జస్టిస్‌ది మైనారిటీ నిర్ణయంగా ఉండ కూడదు. అందుకనే సమావేశాన్ని వాయిదా వేసినట్లు చీఫ్‌ జస్టిస్‌ ప్రకటించినట్లు ఉంది.

ఇదివరకే కేంద్ర ప్రభుత్వం కొలీజియం నిర్ణయాలతో రెండు సార్లు విభేదించింది. ఎప్పుడు కూడా ప్రభుత్వం అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటూ పోతే అదే సంప్రదాయంగా మారుతుంది. అప్పుడు సుప్రీం కోర్టు నియామకాల్లో  సీనియారిటీకున్న ప్రాధాన్యత కోల్పోతుంది. నియామకాల్లోని నిబంధనలనుగానీ, అందుకు పరిగణించే సీనియారిటీని గానీ రక్షించుకోవాల్సింది సుప్రీం కోర్టు కొలీజియమేగానీ, కేంద్రానిది కాదుకదా!  మొత్తంగా న్యాయవ్యవస్థ, ముఖ్యంగా సుప్రీం కోర్టు నిబద్ధతపై నీలినీడలు కమ్ముకుంటున్నవేళ, న్యాయం అన్యాయం అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు తన నిర్ణయానికి కట్టుబడి వ్యవహరించక పోవడం అన్యాయమే.

జనవరి 12 తేదీన నలుగురు సుప్రీం కోర్టు జడ్జీలు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ సుప్రీం కోర్టు అడ్మినిస్ట్రేషన్‌ బాగోలేదని ఆరోపించారు. వారు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి కలిగించేందుకైనా జస్టిస్‌ మిశ్రా స్వతంత్రంగా వ్యవహరించి ఉండాల్సింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రపై ప్రజల్లో కూడా నమ్మకం పోతోందని, దాన్ని పునరుద్ధరించేందుకైనా సుప్రీం కోర్టు జడ్జీలందరితోని ఓ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ న్యాయమూర్తులు చేసిన డిమాండ్‌కు కూడా మిశ్రా స్పందించలేదు.

మరిన్ని వార్తలు