స్విస్ బ్యాంకుల్లో.. రూ. 4479 కోట్లు!

13 Dec, 2014 02:54 IST|Sakshi
స్విస్ బ్యాంకుల్లో.. రూ. 4479 కోట్లు!

హెచ్‌ఎస్‌బీసీ జాబితాపై విచారణ అనంతరం తేల్చిన సిట్
మొత్తం 628లో 289 అకౌంట్లలో జీరో బ్యాలెన్స్
దేశీయంగా గుర్తించిన బ్లాక్‌మనీ రూ. 14, 958 కోట్లు

 
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నల్లధనానికి సంబంధించిన కొన్ని వివరాలను శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి భారత్‌కు అందిన హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు అకౌంట్ల జాబితాపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్).. ఆ వివరాలతో రెండో నివేదికను కోర్టుకు సమర్పించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు సంబంధిత చట్టాలకు సవరణలు సహా 13 సూచనలను అందులో చేసింది. ఆ నివేదికలోని కొన్ని భాగాలను ప్రభుత్వం శుక్రవారం బహిర్గతం చేసింది. స్విస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ల పేర్లను మాత్రం వెల్లడించని ఆ వివరాల ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో 339 మంది భారతీయులు రూ. 4,479 కోట్లను అక్రమంగా దాచారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంబీ షా నేతృత్వంలోని సిట్ పేర్కొంది. దేశీయంగా రూ. 14, 958 కోట్ల నల్లధనాన్నీ గుర్తించినట్లు తెలిపింది.
 
ఫ్రాన్స్ నుంచి అందిన జాబితాలోని 628  మంది భారతీయుల అకౌంట్లలో 79 అకౌంట్ హోల్డర్లపై ప్రాసిక్యూషన్ ప్రారంభమైందని, 289 అకౌంట్లలో డబ్బులేమీ లేవని తెలిపింది. ఆ 628 మందిలో 201 మంది వివరాలు తెలియరాలేదని, మిగతా 427 మందిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. గనుల తవ్వకం, అధిక వడ్డీ ఆశ చూపే ప్రైవేటు పథకాలు తదితర రంగాల్లో బ్లాక్‌మనీ లావాదేవీలకు ఎక్కువ అవకాశాలున్నాయని సిట్ గుర్తించింది. గుజరాత్, మహారాష్ట్రల్లో పెద్ద మొత్తాల్లో నగదు రవాణా చేస్తూ మనీ కొరియర్లుగా వ్యవహరిస్తున్న ‘అంగడియాలు’ బ్లాక్‌మనీ చెలామణీలో కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించింది.నగదు రవాణాపై పరిమితి విధించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని  సూచించింది.  
 
చట్టాలు  మార్చాలి..

సిట్ కొన్ని కీలక సిఫారసులు చేసింది. అవి..

భారతీయులెవరైనా విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటే.. భారత్‌లోని వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణ.
రూ. 50 లక్షలకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినవారిని తీవ్రమైన నేరస్తులుగా పరిగణించి వారిపై  కఠిన చర్యలు తీసుకునేలా సంబంధిత చట్ట సవరణ.
రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు మాత్రమే నగదుగా దగ్గర ఉంచుకునేందుకు, తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలి.
రూ. లక్ష దాటిన లావాదేవీల్లో శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) వివరాలివ్వడాన్ని కచ్చితం చేయాలి.  కాగా బ్లాక్‌మనీని అరికట్టేందుకు పార్టిసిపేటరీ నోట్స్‌ను నిషేధించే ఆలోచన లేదని కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు