మార్చి 31న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ 09 ప్రయోగం

26 Feb, 2017 10:43 IST|Sakshi
మార్చి 31న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ 09 ప్రయోగం

శ్రీహరికోట(సూళ్లూరుపేట):
సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి మార్చి 31న జీఎస్‌ఎల్‌వీ ఎప్‌–09, ఏప్రిల్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3, అదే నెలలోనే పీఎస్‌ఎల్‌వీ సీ38 ప్రయోగాలను నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దమవుతున్నారు.  ఈనెల 15న ఫ్రయోగించిన 104 ఉపగ్రహాల ప్రయోగంతో మంచి జోష్‌ మీదున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఏకకాలంలో మూడు రాకెట్‌ల అనుసంధానం పనులు చేస్తున్నారు.

రెండవ ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ భవనం (వీఏబీ)లో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌09 అనుసంధానం పనులు జరుగుతున్నాయి. అదే విధంగా సాలిడ్‌ స్టేజీ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ (ఎస్‌ఎస్‌ఏబీ)లో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ అనుసంధానం పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్‌–200, ఎల్‌–110, సీ–25  అనే మూడుదశలకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయవంతమయ్యాక ఆ దశలను అనుసంధానం చేస్తున్నారు.

జీఎస్‌ఎల్‌వీ ఎప్‌–09 రాకెట్‌ ద్వారా 2 టన్నుల బరువైన జీశాట్‌–9, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా నాలుగు టన్నుల బరువు కలిగిన జీశాట్‌–19 అనే సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపించేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. మొదటి ఫ్రయోగ వేదికపై మరో వారం రోజుల్లో పీఎస్‌ఎల్‌వీ సీ38 పనులు ప్రారంభించేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఇందులో దూరపరిశీలనా ఉపగ్రహంతో పాటు వాణిజ్యపరమైన ఉపగ్రహాలుండే అవకాశం వుంది.  

ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించి చరిత్ర సృష్టించి ఇప్పుడు మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే ఈ మూడు ఫ్రయోగాలను చేసి మరో రికార్డును సృష్టించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు కృషి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు