ఐటీ దాడుల కలకలం.. 15 కోట్లు స్వాధీనం

13 Apr, 2019 11:37 IST|Sakshi

తమిళనాట ఐటీ దాడులు

సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులో ఐటీదాడుల కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్టులను దక్కించుకునే పీఎస్‌కే ఇంజనీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి చెందిన పలు నివాసాలు, ఆఫీస్‌లలో శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. చెన్నై, నమక్కల్, తిరునల్వేలిలోని 18 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో రూ.14.72 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ఓటర్లకు నగదు పంచేందుకు అభ్యర్థులకు పీఎస్‌కే నుంచి పెద్ద మొత్తంలో నగదు పంపుతున్నట్లు ఐటీ శాఖకు సమాచారమందింది.

దీంతో శుక్రవారం తెల్లవారుజామున పీఎస్‌కే యజమానులు, వారి సంబంధీలకు ఇళ్లు, ఆఫీస్‌లలో అధికారులు సోదాలు చేశారు. ఐటీ అధికారుల బృందం చెన్నై ఎగ్మూరు, అన్నానగర్, సెంట్రల్‌ ప్రాంతాల్లోని పీఎస్‌కే చైర్మన్‌ పెరియస్వామి, కొడుకులు అరుణ్, అశోక్‌ల ఇళ్లు, వీరి ఫైనాన్షియర్లు ఆకాశ్‌ భాస్కర్, సుజయ్‌ రెడ్డిల ఇళ్లు, ఆఫీస్‌లు కలుపుకుని మొత్తంగా 10 చోట్ల సోదాలు నిర్వహించారు. సుజాయ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీస్‌లలో లెక్కల్లో చూపని రూ.18 లక్షల నగదును అధికారులు సీజ్‌ చేశారు. తిరునల్వేలి, విల్లుపురం, నమక్కల్‌లలోనూ తనిఖీలు చేశారు.

మరిన్ని వార్తలు