ఇప్పుడు ‘రామయ్య’ వంతా..?

10 Apr, 2016 09:37 IST|Sakshi
ఇప్పుడు ‘రామయ్య’ వంతా..?

వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల తీరు, వాటి భవిష్యత్‌పై ఇప్పుడు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోందట. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల తర్వాత ఇక వచ్చేది కర్ణాటక వంతేనని కాంగ్రెస్‌నాయకులే గుసగుసలు పోతున్నారట. అరుణాచల్, ఉత్తరాఖండ్‌లో జరిగింది, ఏ కారణం వల్ల అవి జరిగాయన్నది పక్కన పెడితే కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలకు మాత్రం నూటికి నూరుశాతం కాంగ్రెస్ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ పార్టీలోనే అంతర్గత చర్చలు సాగుతున్నాయట.

ఆ రాష్ర్టంలో కూడా అధికారమార్పిడి లేదా ఫిరాయింపులతో కొత్త నాయకత్వ ఆవిర్భావం వంటివి జరిగితే మాత్రం అది కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే అవుతుందని  ఈ చర్చల సారాంశమట. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఏదో ఒకరూపంలో నాయకత్వం మొదలుకుని, ఆ రాష్ట్రపార్టీలోని హైప్రొఫైల్ నాయకులు విసిగిస్తున్నారట. సీఎంకు అత్యంత విలువైన గడియారాన్ని ఎవరో బహూకరించారన్న దానిపై సొంతపార్టీ నేతలే లేవనెత్తిన పంచాయితీ ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకే బాగా నష్టం చేసిందంటున్నారు.

ఇప్పటికైనా సిద్ధరామయ్యకు పాలన, ఇతరత్రా విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, అసంతృప్త, అసమ్మతి నేతల ప్రభావం పడకుండా  సరిదిద్దుకుంటే  తప్పా.. పరిస్థితి సద్దుమణిగేలా లేదంటున్నారు. సిద్ధరామయ్యలో అసంతృప్తి ఇతరత్రా పరిణామాలను ఆసరాగా తీసుకుని బీజేపీ పావులు కదిపినా కదపవచ్చుననే అనుమానాలను కూడా కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అదీగాకుండా సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి, జేడీ(ఎస్)ను కూడా కలుపుకుని తన సొంతపార్టీని ఏర్పాటు చేసుకుంటే పార్టీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారవుతుందని ఆ పార్టీ నాయకులు ముక్తాయింపునిస్తున్నారు.

మరిన్ని వార్తలు