'నన్ను జైలులో వేయండి.. లాయర్లను భరించలేను'

17 Aug, 2016 10:09 IST|Sakshi
'నన్ను జైలులో వేయండి.. లాయర్లను భరించలేను'

న్యూఢిల్లీ: తనను జైలులో వేయాలని మాజీ కోల్ సెక్రటరీ  హెచ్సీ గుప్తా అన్నారు. తాను జైలు నుంచే విచారణకు హాజరవుతానని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. తాను లాయర్లను భరించలేనని, వారికయ్యే ఖర్చు తాను చెల్లించలేనని చెప్పారు. తన బెయిల్ కోసం వ్యక్తిగతంగా కోర్టుకు సమర్పించిన బాండ్ను తనకు తిరిగి ఇచ్చేయాలని కోర్టును కోరారు. తన వద్ద అసలు డబ్బులేదని, లిటిగేషన్ ఖర్చులు కూడా భరించలేనని, అందుకే తాను జైలులోనే ఉంటూ విచారణ ఎదుర్కొంటానని అన్నారు.

హెచ్సీ గుప్తా యూపీఏ ప్రభుత్వ హయాంలో కోల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయనపై బొగ్గు కుంభకోణానికి సంబంధించి పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న ఆయన తన బెయిల్ను సరెండర్ చేస్తున్నానని చెప్పారు. ప్రతిగా తాను బెయిల్ కోసం పెట్టిన బాండ్ ను తిరిగి ఇచ్చేయాలని కోరారు. కాగా, ఈ పిటిషన్ పై స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం ఆయనను మరోసారి ఆలోచించుకోవాలని చెప్పడమే కాకుండా.. ఈ పిటిషన్ సంబంధించి ప్రతిస్పందన తెలియజేయాలని కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులను కోరింది.

మరిన్ని వార్తలు