కనికాకు కరోనా : కేసు నమోదు

21 Mar, 2020 10:09 IST|Sakshi

లక్నో బాలీవుడ్‌ ప్రముఖ గాయని కనికా కపూర్‌పై ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఐపీసీ 188, 269, 270 సెక్షన్ల్‌ ప్రకారం సరోజిని నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్‌ పాండే తెలిపారు. అలాగే చట్టంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గుమికూడి ఉండటం వంటి చట్టాల ప్రకారం ఆమెపై మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదైనట్లు వెల్లడించారు. కాగా కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ను వైద్యులు నిర్థారించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. (కనికా కపూర్‌కు కరోనా)

దీనిలో రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌లు పాల్గొన్నారు. రాజస్తాన్‌ నుంచి ఎంపీగా ఉన్న దుష్యంత్‌ పార్లమెంటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్‌లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారు కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ఉపాహార విందుకు పలువురు ఎంపీలతోపాటు దుష్యంత్‌ కూడా హాజరయ్యారని, బుధవారం రవాణా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన సమావేశంలోనూ దుష్యంత్‌ 20 మంది ఎంపీలతో కలిసి ఉన్నారని డెరెక్‌ వివరించారు. (కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం)

విమర్శలు వెల్లువ..
మరోవైపు కనికా బాధ్యతారాహిత్యంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి తిరిగివచ్చినవారు కచ్చితంగా రెండు వారాల స్వీయ నిర్బంధం పాటించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా... కనిక ఇవేమీ పట్టనట్టు వ్యవహరించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రెటీ హోదాలో ఉండి కూడా నిర్లక్ష్యంగా దావత్‌లకు హాజరై ముప్పు తెచ్చారని విమర్శిస్తున్నారు. అయితే కనిక మాత్రం తన తప్పేమీ లేదని వాదిస్తున్నది. పదిరోజుల కిందట ఎయిర్‌పోర్టుల్లో పరీక్షించినప్పుడు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పింది. నాలుగురోజుల కిందట ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా