దీపికపై ట్రోలింగ్‌.. స్పందించిన కనిమొళి

8 Jan, 2020 14:50 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించారు. బుధవారం జేఎన్‌యూకు వెళ్లిన కనిమొళి యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనేపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తప్పుబట్టారు. తను చాలా వరకు హిందీ సినిమాలు చూడనని.. కానీ దీపికకు మద్దతుగా  ఛపాక్‌ సినిమాను చూస్తానని చెప్పారు. 

కాగా, మంగళవారం సాయంత్రం జేఎన్‌యూకు వెళ్లిన దీపిక.. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు దీపికను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఆమె తాజా చిత్రం  ఛపాక్‌ను బాయ్‌కాట్‌ చేయాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఆమె ప్రదర్శించిన ధైర్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్‌ హారో అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరిన్ని వార్తలు