ఆదెమ్మ.. అమృత హస్తమేనమ్మా

11 Oct, 2019 09:39 IST|Sakshi
తను కాన్పు చేసిన చిన్నారి, తల్లిని పలకరిస్తున్న ఆదెమ్మ

వేలాది ప్రసవాలు చేసిన ఘనత సూలగిత్తి ఆదెమ్మ సొంతం

ఆమె సేవలు గుర్తించని సర్కార్‌

ఇప్పటికీ అందని సాయం, పెన్షన్‌

సాక్షి,కర్ణాటక, బళ్లారి : ఆరోగ్య సేవలు విస్తారంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాన్పుల విషయంలో ప్రతి ఒక్కరూ ఆస్పత్రికి వెళ్లి అక్కడే ప్రసవించడం సర్వసాధారణమైంది. ఆస్పత్రిలో నూటికి 90 మంది సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసే ప్రసవం చేస్తున్నారు. అదేమని అడిగిన బాధితులకు బిడ్డ అడ్డం తిరిగిందని లేదా మరేదో సమస్య ఉందని ప్రతి వైద్యులు ఇస్తున్న సమాధానం. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుల సహాయం లేకుండా మన పూర్వీకుల నుంచి కొనసాగిస్తున్న సూలగిత్తి పద్ధతిని నేటికీ పల్లెల్లోనే కాదు నగరంలో కూడా కొనసాగిస్తూ ఎందరో గర్భిణులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సుఖమయంగా ప్రసవం చేస్తున్న ఓ సూలగిత్తి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.  బళ్లారితో పాటు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని కర్నూలు జిల్లా హాలహర్వి ప్రజలు తమ బిడ్డల కాన్పుల కోసం హెచ్‌.ఆదెమ్మపైనే ఆధారపడ్డారు. అత్యంత సులభంగా కాన్పులు చేయడంలో నేర్పరితనం ఆమె సొంతం. అందుకే ఈమె చేతి గుణంపై ప్రజలకు అపారమైన నమ్మకం. అందుకే ఆదెమ్మ ఎక్కడున్నా మరీ వెతుక్కొని వెళతారు. 

పూర్వం నుంచి ఎంతో ఆదరణ
పూర్వం నుంచి ఇప్పటికీ మారు మూల పల్లెల్లో ఎద్దుల బండిలో ఈమెను ఆధారంగా తీసుకొచ్చే వారు. ప్రస్తుతం కొందరు కారులో ఆమెను తీసుకెళ్తుంటారు. 80 ఏళ్ల ఆదెమ్మ ఇప్పటికీ చెరగని, తరగని ఉత్సాహంతో కాన్పులు చేయడానికి శ్రమిస్తారు. ఇప్పటి వరకు 5 వేలకు పైగా ప్రసవాలు చేసిన ఘనత ఆమెది. కొన్ని కుటుంబాలు మూడు తరాలుగా ఈమె హస్తగుణాన్ని నమ్మారంటే ఈ మహాతల్లికి ఉన్న నైపుణ్యం అర్థమవుతోంది. బళ్లారి తాలూకా హంద్యాళ గ్రామానికి చెందిన ఆదెమ్మకు మాతృమూర్తి పార్వతమ్మే గురువు. పెళ్లి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లోని హాలహర్వికి వెళ్లిన ఆదెమ్మ అక్కడ ఎన్నో కాన్పులు చేశారు. ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయా పని లభించిందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈమె సేవ ఎంతటి ఘనత సాధించిందో అర్థమవుతోంది. అనంతరం ఆ పనికి స్వస్తి చెప్పి కుటుంబంతో స్థిరపడ్డారు. 

కాన్పు ఎప్పుడవుతుందో చెప్పగల దిట్ట
నాడి ఇలా పట్టుకొని కాన్పు ఎప్పుడు అవుతుందో చెప్పడంలో ఈమెకు ఉన్న అనుభవం అపారం. కాన్పు కష్టకరమవుతుందని ఈమె అనుకుంటే తక్షణమే ఆస్పత్రికి తరలిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు లేక ముఖ్యమైన పనిలో ఉన్నా కూడా కాన్పులు చేయడానికి మాత్రం సదా సిద్ధమంటూరు ఆదెమ్మ. పూర్వం మహిళలు చాలా గట్టితనంతో ఉండేవారు. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా సునాయాసంగా ప్రసవాలు జరిగేవి అప్పట్లో. ఇప్పటి మహిళలకు పురిటి నొప్పులను తట్టుకునే ఓర్పు, నేర్పు వారికి లేవని, తన వల్ల ఇప్పటి వరకు ఏ తల్లీబిడ్డ ప్రాణానికి ముప్పు కలగలేదని విశ్వాసంగా చెబుతారు. 2011లో అప్పటి జిల్లా ఇన్‌చార్జ్, పర్యాటక శాఖా మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి ఈమె సేవలను గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించడం విశేషం. అయినా ఇంతటి ఉత్తమ సమాజ సేవలను అందిస్తున్నా ఈమెకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పెన్షన్‌ కానీ, ఇతర సౌకర్యాలు కానీ అందకపోవడం విచారకరం. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా