ఆ మట్టికి పోరాడే శక్తి!

22 Aug, 2018 08:05 IST|Sakshi
కేరళను ముంచెత్తిన వరదలు... ఇన్‌సెట్లో ‘కేరళ వరదలు 1924’ బీభత్సం

వైపరీత్యాలకూ వెరవని కేరళ ...

అంతా సజావుగా సాగకపోవచ్చు. కొన్ని లోపాలు కూడా తలెత్తి ఉండొచ్చు. ప్రజలంతా వరదల్లో చిక్కుకుంటే నిరాశా నిస్పృహలు చుట్టముట్టడం సహజమే. అయినా కేరళ తట్టుకుంది. ధైర్యంగా నిలబడింది. అనేక ఒడిదుడుకులను ఎదురొడ్డి నిలిచింది. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోకుండా అనితరసాధ్యమైన సాహసాలు చేసి ప్రజలను రక్షించుకుంది. గత కొన్ని రోజులుగా వరదల్లో చిక్కుకున్న కేరళ అదే పోరాటపటిమను ప్రదర్శించింది. 

కేరళ పాలకులకూ, నాయకత్వానికీ నిజానికి ఇదొక పెద్ద సవాల్‌! ప్రధానంగా యావత్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని కేంద్రీకరించి, సైనికదళాల సాయంతో తమ ముందున్న సవాళ్ళను అధిగమించడంలోనూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కృతకృత్యులయ్యారు. సాహసోపేతమైన సహాయక చర్యలు రాష్ట్రంలో మొత్తం 22000 మంది ప్రజలను రక్షించింది. వరదల్లో చిక్కుకున్న 7.24 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా పెద్ద సంఖ్యలో వృద్ధులనూ, చిన్నారులనూ రక్షించింది. 

వారి దీక్ష అనన్య సామాన్యం...
మొన్న నిఫా వైరస్‌ ఎదుర్కొన్నట్టుగానే నేడు వరద ప్రళయాన్నీ తప్పించుకోవడంలో కేరళ ప్రజల పాత్ర అనన్యసామాన్యమైనది. వైద్యులు, ఉపాధ్యాయులూ, విద్యార్థులూ, ఐటి ఉద్యోగులూ ఇలా ప్రజలంతా ఎవరికి తోచిన సాయం వారందించారు. వరద బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో అహోరాత్రులు శ్రమించారు. ఎక్కడో వరదల్లో చిక్కుకుపోయిన గర్భిణులనూ, చిన్నారులనూ భుజాలకెత్తుకుని తీసుకెళ్ళారు. వృద్ధులను నెత్తిన మోసుకొచ్చారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి కావాల్సిన ఆహారపదార్థాలను అందించడానికి ఎందరో దాతలు ముందుకొచ్చారు. నీటిలో నానుతూ రోజుల తరబడి ఉండిపోయిన స్త్రీలకు అవసరమైన లోదుస్తులూ, సానిటరీ ప్యాడ్స్‌ని సైతం ప్రత్యేకించి వారికి చేర్చేందుకు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసిన స్వచ్ఛంద కార్యకర్తలెందరో కేరళ ప్రజల్లో దాగున్న పోరాటపటిమను చాటిచెప్పారు. సమైక్య శ్రమసౌందర్యాన్ని ప్రపంచ ప్రజలకు రుచిచూపించిన కేరళ మత్స్యకారుల పాత్రను చరిత్ర మరువజాలదు. ఊరూ పేరూలేని చేపలుపట్టే సాధారణ ప్రజలు సైతం తమతమ బోట్లతో సొంత ఖర్చుతో వరదప్రాంతాలకు చేరుకొని తమ శరీరాలను మెట్లుగా మలిచిన సందర్భం అపురూపమైనది. 

అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది...
ఇప్పటికే స్వచ్ఛందంగా ఎంతో మంది ముందుకొచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇందులో మత్స్యకారుల పాత్ర ప్రత్యేకించి చెప్పుకోదగినది.  సైన్యం నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది. అయినప్పటికీ ఇంకా చాలా పని మిగిలేవుంది. అంటువ్యాధులు పొంచి ఉన్నాయి. వైద్య సహాయం తక్షణావసరం. తాగునీటిని అందించడం, నిలవచేసుకోవడం. విద్యుత్‌ను పునరుద్ధరించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా సర్వస్వం కోల్పోయిన కేరళ ప్రజలు తమ జీవితాలను మళ్ళీ మొదటినుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి. ఇళ్ళూ, పంటలూ, పొలాలూ, పాఠశాలలూ, అన్నీ కోల్పోయిన ప్రజలు ఇప్పుడు సహాయకశిబిరాల నుంచి తిరిగి తమతమ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ ఏమీలేని స్థితి నుంచి జీవితాలను ప్రారంభించాలి. కేరళ మట్టిలోనే పోరాడే శక్తి ఉంది. అక్కడి ప్రభుత్వం ప్రజలు సమైక్యంగా వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్న తీరు 1924లో కేరళని అతలాకుతలం చేసి ఇలాంటి వరదలనే గుర్తుకు తెస్తోంది. 

అప్పుడు సైతం...
1924లో కేరళని ముంచెత్తిన వరదలు దక్షిణ భారతదేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని నష్టపరిచాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా పశువులు చనిపోయాయి. పూర్వీకుల కథల్లో ఆ విషాదం ఇంకా మిగిలేవుంది. అప్పుడు కూడా కేరళని ఆదుకునేందుకు అంతా కదిలివచ్చారు. 1924 ఆగస్టులో వచ్చిన ఈ వరదల్లో వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 4000 మందిని అమబాలప్పుజా, 3000 మందిని అల్లెప్పీ, 5000 మందిని కొట్టయాం, 3000 మందిని చంగనాస్సెరీ, 8000 మందిని పెరూర్‌ తదిరత ప్రాంతాలకు పంపారు. ఆ యేడాది ప్రజలకు టాక్సులు వ్యవసాయ పన్నులు రద్దుచేసారు. వ్యవసాయ రుణాల కోసం 4 లక్షలు ప్రత్యేకించి కేటాయించారు. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక ఇళ్ళనిర్మాణం కోసం ఆర్థిక సాయం, వెదురును ఉచితంగా సరఫరా చేయడంలాంటి ఎన్నో కార్యక్రమాలు స్వర్గథామంలాంటి కేరళను మళ్ళీ మెల్లమెల్లగా పుంజుకునేలా చేసాయి. 

అటు కేంద్రం... ఇటు రాష్ట్రప్రభుత్వం...
విపత్తులు సంభవించినప్పుడు, ప్రళయం ప్రజల ప్రాణాలను కబళిస్తున్నప్పుడు అన్నింటినీ పక్కకు పెట్టాల్సిందేనని కేరళ విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు రుజువుచేసాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వైద్యం కోసం అమెరికా వెళ్ళాల్సి ఉన్నా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొని ప్రజలకూ, కేంద్ర ప్రభుత్వానికీ నిత్యం అందుబాటులో ఉన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి కేరళ ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్రమోడీకి కేరళ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అందుతోన్న సైనిక సహకారాన్నీ, అదనంగా కావాల్సిన తోడ్పాటుని గురించీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాష్ట్రంలో జరుగుతోన్న సహాయక చర్యలపట్ల హర్షం వ్యక్తం చేసారు. తక్షణ అవసరాలకనుగుణంగా కేంద్రం స్పందిస్తోంది.

మరిన్ని వార్తలు