‘377’ కేసులు యూపీలోనే అత్యధికం

10 Sep, 2018 03:01 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కులకు సంబంధించి ఐపీసీ సెక్షన్‌ 377 కింద అత్యధిక కేసులు ఉత్తరప్రదేశ్‌లో నమోదయిన్నట్లు తేలింది. జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్బీ) నివేదిక ప్రకారం 2016లో యూపీలో 999 కేసులు నమోదుకాగా, కేరళ (207), ఢిల్లీ(183), మహారాష్ట్ర(170)లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇద్దరు వయోజనులైన పురుషులు లేదా స్త్రీల మధ్య పరస్పర సమ్మతితో ప్రైవేటుగా సాగే శృంగారం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్‌ 377లోని కొన్ని నిబంధనలను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అవతలి వ్యక్తి సమ్మతి లేకుండా లేదా మైనర్లతో లేదా జంతువులతో చేసే శృంగారాన్ని నేరంగానే పరిగణించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్‌సీఆర్బీ నివేదిక ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా పురుష స్వలింగ సంపర్కులపై 2,195 కేసులు నమోదుకాగా, 2015లో 1,347, 2014లో 1,148 కేసులను పోలీసులు నమోదుచేశారు. తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో వీరిలో చాలామంది నిందితులకు ఊరట లభించే అవకాశముందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు