'గ్యాస్‌ లీకేజీ ఘటన దురదృష్టకరం'

7 May, 2020 10:05 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : విశాఖ ఎల్‌జి పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి  ప్రకటించారు. బాధితుల కుటుంబసభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి సమీక్షించినట్లు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుగురుకు పెరిగింది. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరోవైపు విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలో బావిలో పడి గంగరాజు అనే వ్యక్తి మృతిచెందగా, మేడపై నుంచి పడి మరోకరు ప్రాణాలు కోల్పోయారు.  కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి
విజయవాడ :
విశాఖ ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల తరలింపులో రెడ్ క్రాస్ వలంటీర్ల సేవలను వియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్ క్రాస్‌కు గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు.

(విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)
(విశాఖకు రానున్న సీఎం వైఎస్‌ జగన్‌)

మరిన్ని వార్తలు