Sakshi News home page

కొడుకును సీఎం చేయడంపైనే ధ్యాస

Published Sun, Oct 15 2023 1:53 AM

BJP Chief G Kishan Reddy Aggressive Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన కొడుకును సీఎం చేయడం తప్ప తెలంగాణ ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా సీఎం కేసీఆర్‌ తీరుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయం బాగుపడాలంటే సాగునీరు రావాలని, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ అధ్వర్యంలో నిర్వహించిన రైతుసదస్సులో కిషన్‌రెడ్డి మాట్లా డారు.

కేసీఆర్‌ సీఎం అయ్యాక ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్‌ పేరుతో రూ.30 వేల కోట్ల బడ్జెట్‌ను రూ.లక్షా 50 వేల కోట్లకు తీసుకెళ్లారని మండిపడ్డా రు. అయినా ఆ ప్రాజెక్టుకు ఫీజబిలిటి లేదని, కరెంట్‌ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందన్నారు. రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనలతో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ.57 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఒక్క పంపు హౌజ్‌ను ప్రారంభించి ఎన్నికల ముందు పాలమూరుకు మొత్తం నీళ్లు ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారన్నారు. 

చంద్రబాబుకు అమ్ముడుపోయారు: బండి 
నాటి ఏపీ సీఎం చంద్రబాబుకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్‌ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు టెండర్ల పేరుతో సీఎంవో రూ. 500 కోట్లు దండుకుని ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. కేసీఆర్‌ నిర్వాకంవల్ల రూ.40 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన పౌరసరఫరాల సంస్థను నిండా ముంచేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ‘కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటు కాకూడదు.. ప్రజలకు మేలు జరగకూడదన్నదే కేసీఆర్‌ ఆలోచన. థ్యాంక్స్‌ చెబితే నీకేమైతుంది? ముత్యాలేమైనా రాలతాయా?’అని అన్నారు. 

వారికి స్థానం లేదు: కేంద్రమంత్రి కైలాశ్‌ చౌదరి 
‘భారత్‌ మాతా కీ జై.. వందే మాతరం అనని వారికి ఈ దేశంలో స్థానం లేదు. పాకిస్తాన్‌ జిందాబాద్‌ అనే వారు అక్కడికి వెళ్లొచ్చు’అని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్‌ చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంట్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారని, వచ్చే కొద్దిపాటి కరెంటు కూడా ట్రిప్‌ అయి వస్తోందని చెప్పారు. ‘గతంలో గాంధీ పేరును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ దోచుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో దోచుకోవాలని చూస్తోంది. ఇది ఘమండి, ఘట్‌ బంధన్‌ కూటమి’అని మండిపడ్డారు. ఈ సదస్సులో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.   

Advertisement

What’s your opinion

Advertisement