ఉన్నావ్‌ కేసు : చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే

21 May, 2018 16:36 IST|Sakshi
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్‌ లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ చిక్కుల్లో పడ్డారు. కస్టడీలో బాధితురాలి తండ్రిని పోలీసులు హింసించిన రాత్రి ఎమ్మెల్యే తనకు పలుమార్లు ఫోన్‌ చేశారని మాఖీ పోలీస్‌ స్టేషన్‌ అధికారి కేపీ సింగ్‌ నిర్ధారించారు. బాధితురాలి తం‍డ్రిని ఎమ్మెల్యే సోదరుడు అతుల్‌ సింగ్‌ సెంగార్‌, ఇతరులు దారుణంగా కొట్టిన క్రమంలో అదే రోజు రాత్రి బాధితురాలి తం‍డ్రిపై కఠిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చారని సీబీఐ విచారణలో సింగ్‌ చెప్పారు. ఆ రోజు రాత్రి ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ కనీసం పదిసార్లు స్టేషన్‌ అధికారి సింగ్‌కు ఫోన్‌ చేసినట్టు కాల్‌ వివరాలు వెల్లడించాయని సీబీఐ నిర్ధారించింది.

ఉన్నావ్‌ లైంగిక దాడి కేసులో బాధితురాలి తం‍డ్రి పోలీస్‌ కస్టడీలో మరణించిన కేసుకు సంబంధించి కేపీ సింగ్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. కాగా సింగ్‌ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. మరోవైపు కేసు పురోగతికి సంబంధించిన నివేదికను సబీఐ అలహాబాద్‌ హైకోర్టులో సమర్పించింది. మే 30న కేసుపై తదుపరి విచారణ చేపడతారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతిని ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడినట్టు ఎమ్మెల్యే సెంగార్‌పై ఆరోపణలున్న విషయం తెలిసిందే. బాధిత యువతి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ నివాసం ఎదుట సజీవ దహనానికి ప్రయత్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  

మరిన్ని వార్తలు