భావోద్వేగానికి లోనైన యువ లేడీ లెఫ్ట్‌నెంట్‌ 

9 Mar, 2018 21:22 IST|Sakshi

భారత్, చైనా సరిహద్దుల్లో.. కొన్ని వేల అడుగుల ఎత్తులో.. అంతకంటే ఎత్తుకి సమున్నతంగా ఎదిగిన తన తండ్రి గొప్పతనాన్ని తెలుసుకున్న ఆ ఆర్మీ ఆఫీసర్‌ ఆనందానికి అవధులే లేవు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఒక యువ లేడీ లెఫ్ట్‌నెంట్‌ ఇటీవల తవాంగ్‌ సెక్టార్‌లో బాధ్యతలు స్వీకరించింది. విధి నిర్వహణలో భాగంగా సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న కైఫోకు చేరుకుంది. అక్కడ ఒక ఆర్మీ శిబిరానికి ఆశిష్‌ టాప్‌ అని పేరు ఉండడం గమనించింది. సహజ సిద్ధమైన ఆసక్తితో అక్కడే విధుల్లో ఉన్న సైనికుల్ని ఆశిష్‌ అంటే ఎవరని ప్రశ్నించింది. వారిచ్చిన సమాధానం ఆమెకు నోట మాట రాకుండా చేసింది. ఆ ఆశిష్‌ ఎవరో కాదు. ఆమె కన్నతండ్రి. అసోం రెజిమెంట్‌లో ఆశిష్‌ దాస్‌ కల్నల్‌గా రిటైరయ్యారు. ఒక కల్నల్‌గా తన తండ్రి ఏ స్థాయికి చేరుకున్నాడో తెలుసుకున్న ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనైంది.

తన కుటుంబానికి చెందిన ఒక రహస్యం తెలుసుకొని సంభ్రమాశ్చర్యానికి లోనైంది.  ఆ లేడీ ఆఫీసర్‌ భావసంచలనాన్ని గమనించిన ఆర్మీ సిబ్బంది ఆమె తండ్రికి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పారు. ఏకంగా ఆర్మీ శిబిరానికే ఒక అధికారి పేరు పెట్టారంటే అదేమీ ఆషామాషీ విషయం కాదు. చైనా కుటిల బుద్ధిని ఆశిష్‌ దాస్‌ ఎలా తిప్పికొట్టారో తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1986 లో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వాస్తవాధీన రేఖ వెంబడి మన భూభాగంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సమ్‌డ్రోంగ్‌ చూ లోయలో హెలిపాడ్‌లు, ఇతర శాశ్వత నిర్మాణాలకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిని అడ్డుకోవడానికి అప్పటి ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కె సుందర్‌జీ అత్యంత రహస్యంగా ఆపరేషన్‌ ఫాల్కన్‌ నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌కు ఆశిష్‌ దాస్‌ నేతృత్వం వహించారు. నెత్తురు గడ్డకట్టే చలిలో డ్రాగన్‌ దేశం ఆక్రమణలను తిప్పికొట్టడానికి వీరోచిత పోరాటమే చేశారు. చైనా  సైన్యం కాల్పులు తెగబడుతుంటే ఆత్మరక్షణ కోసం ఒక బంకర్‌ నుంచి మరో బంకర్‌లోకి వెళ్లి తలదాచుకున్నారు. ఆ తర్వాత ఆశిష్‌ దాస్‌ తానే ప్రాణాలను పణంగా పెట్టి చైనా ఆర్మీపై కాల్పులు జరిపాడు. ఆశిష్‌ దాస్‌ ధాటికి డ్రాగన్‌ సైన్యం తోకముడిచింది. ఈ పోరాటం క్రమంలో ఆశిష్‌ దాస్, మరికొందరు సైనికులకు తిండి కూడా దొరకలేదు..  ఆకలికి మలమల మాడిపోయారు. కొన్నిసార్లు ఎలుకల్ని పట్టి తిని కడుపునింపుకున్నారు. అయినా తమ పోరాట స్ఫూర్తిని వదలుకోలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఆశిష్‌ దాస్‌ సేవలకు గుర్తుగా ఆయన పదవీవిరమణ చేసిన తర్వాత అక్కడ సైనిక శిబిరానికి ఆశిష్‌ టాప్‌ అని పేరు పెట్టారు. అయితే ఈ విషయం ఆయనకు కూడా చాలా ఆలస్యంగా 2003 సంవత్సరంలో తెలిసింది. ఒక కల్నల్‌గా తాను చేసిన పోరాటాన్ని తన కుమార్తెకు ఎప్పుడూ చెప్పలేదని, ఎందుకంటే అప్పటికి ఆమె ఇంకా పుట్టలేదని దాస్‌  చెప్పుకొచ్చారు. అలా కన్నతండ్రి గురించి ఏమీ తెలీకపోవడంతో ఆశిష్‌ టాప్‌ అన్న పేరు చూడగానే ఆ యువ లెఫ్ట్‌నెంట్‌ ఆనందంతో కన్నీటిపర్యంతమైంది.

మరిన్ని వార్తలు