‘ఇది జంగిల్‌ రాజ్యం.. ఇక్కడ బడే పదిలం’

9 Oct, 2018 12:47 IST|Sakshi

పాట్నా : వసతి గృహం గోడలపై పిచ్చి రాతలు రాస్తున్న యువకునికి బుద్ది చెప్పిన బాలికలపై దాదాపు 20 మంది యువకులు దాడి చేసిన సంఘటన తెలిసిందే. బిహార్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం  తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వసతి గృహంపై దాడిని ఖండస్తూ.. సదరు బాలికలకు తన మద్దతును తెలియజేస్తూ మర్య శకిల్‌ అనే యువతి ఓ లేఖను విడుదల చేశారు.

దీనిలో ఆమె ‘మీరంతా సాధికారత సాధించినట్లు నేను భావిస్తున్నాను. మీ సైకిల్లు కార్లు, బస్సులతో పోటీ పడుతూ బిహార్‌ వీధుల వెంట పరుగు తీసేవి. మీ కళ్లలో ప్రపంచాన్ని జయిస్తాం అనే ధీమా కన్పించేది. ప్రతి ఒక్కరికి చదుకునే హక్కుంది. కానీ మా లాంటి తల్లులే ఆడపిల్లలకు చదువేందుకు అని ఆలోచిస్తుంటా. కానీ ఈ రోజు జరిగిన ఓ సంఘటన మీ సైకిల్‌ని రివర్స్‌ చేసింది. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మీ వసతి గృహం మీద ఓ పిచ్చి మూక విచాక్షణారహితంగా దాడి చేసింది. మీలో ఓ 30 మంది ఆస్పత్రి పాలయ్యారు’ అన్నారు.

ఇంకా కొనసాగిస్తూ.. ‘ఇదంతా ఎందుకు జరిగింది.. ఎందుకంటే మిమ్మల్ని వేధించే వారి మీద మీరు తిరగబడ్డారు. మీ పాఠశాలలో జరిగిన సంఘటన ఒక్కటి చాలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం అవ్వడానికి. ఇక్కడ స్త్రీ స్వేచ్ఛకు, సాధికారతకు ఒక రకమైన తప్పుడు సరిహద్దులను నిర్ణయించారు. కానీ మీరు భయపడకండి.. పాఠశాలే మీకు అత్యంత సురక్షితమైన తావు. ఇక్కడ మిమ్మల్ని కాపాడటానికి టీచర్లు, ‍ప్రిన్సిపాల్‌ ఉన్నారు. వసతి గృహం మీద దాడి కానీ, ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం లో జరిగిన అకృత్యాల గురించి కానీ నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దీని బట్టే ఈ ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తెలుస్తుంది’ అన్నారు.

అంతేకాక ‘భూస్వామ్య వ్యవస్థ వేళ్లునుకుపోయిన బిహార్‌ రాష్ట్రంలో మహిళలు మద్యపాన నిషేదాన్ని సమర్థించడం జరిగింది. ఇప్పుడిప్పుడే నా రాష్ట్రంలో సాంఘీక సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. ఇది సంతోషకర పరిణామం. ఇక మీదట బిహార్‌ సీఎం సైకిల్లను ఇవ్వడం ఆపి మహిళల భద్రత, రక్షణల గురించి ఆలోచిస్తే మంచిది. బిహార్‌ మహిళలు కులానికి అతీతంగా ఓ తటస్థ వర్గంగా మారుతున్నారు. వారు తమ హృదయంతో ఆలోచించడం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికి కూడా బిహార్‌ ఓ జంగిల్‌ రాజ్యమే. ఇక్కడ స్కూల్‌ తప్ప మరేది సురక్షితం కాదు. జరిగిన సంఘటనలతో మీరు ధైర్యాన్ని కోల్పోకండి. ఇలాంటి సంఘటనల వల్లే మనలోని ధైర్యం బయటకు వస్తుంది. మిమ్మల్నందరిని చూస్తుంటే నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మహిళలకు గౌరవం ఇవ్వని పురుషులతో ఇలాగే ప్రవర్తించాలి. మీరంతా మీ జీవితాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీ మర్య శకిల్‌’ అంటూ ముగించారు.

మరిన్ని వార్తలు