4 రోజుల్లో నలుగురు దళితుల హత్య

12 May, 2020 11:32 IST|Sakshi

చెన్నై: తమిళనాడు రాష్ట్రం వేధింపుల రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నన్ని దాడులు మరే రాష్ట్రంలో జరగడం లేదని మధురైకి చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజుల్లో నలుగురు దళితులు హత్యకు గురయ్యారంటూ సామాజిక కార్యకర్త కథీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన కొందరు లాక్‌డౌన్‌ సమయాన్ని దళితులపై దాడి చేసేందుకు ఓ అవకాశంగా వినియోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా కథీర్‌ మాట్లాడుతూ.. ‘40-50 మంది జనాలు గుంపులుగా ఏర్పడి నిమ్నవర్గాల వారిపై దాడులకు పాల్పడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇది ఎలా సాధ్యమయ్యింది?. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి దేశంలో గృహహింస పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే కేవలం గృహ హింస మాత్రమే కాక కులం పేరుతో జరిగే వేధింపులు కూడా బాగా పెరిగాయి. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేవలం ఒక్క నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 100 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో కొన్ని అత్యాచారం, హత్య, పరువు హత్య వంటి తీవ్ర నేరాలు కూడా ఉన్నాయి’ అని అన్నారు. 
 
దేశంలో మొదటి దశ లాక్‌డౌన్‌ ప్రారంభమైన తర్వాత మార్చి 29న ఆరనిలోని మోరప్పంతంగల్‌ గ్రామంలో పరువు హత్య చోటు చేసుకుందని కథీర్ తెలిపారు‌. ‘గ్రామంలోని ఒద్దార్‌ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్‌ అనే యువకుడు  వన్నియార్‌ కులానికి చెందిన  ఓ యువతిని ప్రేమించాడు. దాంతో సదరు యువతి తల్లిదండ్రులు సుధాకర్‌ మీద దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు యువతి తండ్రితో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో హైకోర్టు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్‌ ఆఫ్‌‌ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. ఫలితంగా ఈ తరహా కేసుల్లో నిందితులు సులభంగా బెయిల్‌ పొంది.. శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు’ అంతేకాక ఈ ఘటనల గురించి ప్రచారం చేసిన రిపోర్టర్ల మీద కూడా దాడులు చేస్తున్నారరని కథీర్‌ ఆరోపించారు.

పట్టణాల నుంచి గ్రామాలకు వస్తోన్న నిమ్న వర్గాల వారి మీద కూడా దాడులు పెరిగాయని కథీర్ వెల్లడించారు‌. ‘పట్టణాల నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు గురవుతున్నారు. అంతేకాక ఉన్నత వర్గాల ప్రజల దళితుల కాలనీల చుట్టు కంచెలు ఏర్పాటు చేసి వారిని గ్రామంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దుకాణాదారులు వారికి నిత్యావసరాలు అమ్మడం లేదు’ కరోనా మహమ్మారి సమయంలో కూడా, కులతత్వం ఆగిపోలేదని.. ఈ వివక్షను, దాడులను ఆపడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని కథీర్‌ కోరారు. (వలస కూలీలను బూటుకాలితో తన్నిన పోలీస్‌)

మరిన్ని వార్తలు