ఆ గవర్నర్ కు ఉద్వాసన తప్పదా..!

9 Jul, 2015 13:48 IST|Sakshi
ఆ గవర్నర్ కు ఉద్వాసన తప్పదా..!

న్యూఢిల్లీ : వ్యాపమ్ కుంభకోణంలో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. అదే విధంగా ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కు ఉద్వాసన తప్పదా... అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి.
రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి రాగానే ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఈ రోజు గవర్నర్, కేంద్రానికి నోటీసులు జారీచేసిన విషయం విదితమే.

నాలుగు వారాల్లో ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవాలని నోటీసులలో పేర్కొంది. మధ్యప్రదేశ్ కి చెందిన లాయర్లు గవర్నర్ను తొలగించాలంటూ దాఖలు చేసిన పిటీషన్పై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్రం, గవర్నర్ కు నోటీసులిచ్చింది. వ్యాపమ్ కేసులో నిందితుడు-10 గా గవర్నర్ పేరును నమోదు చేసినట్లు పోలీసు డాక్యుమెంట్లలో ఉంది. గత మార్చిలో లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో గవర్నర్ సహా అతని కుమారుడు శైలేశ్ యాదవ్లు నిందితులుగా ఉన్నారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు ఒక్కొక్కరు చనిపోతున్న విషయం విదితమే.

ప్రభుత్వ టీచర్ల అర్హత పరీక్షల నేపథ్యంలో గవర్నర్ ఆఫీసులో శైలేశ్కు రూ.3 లక్షలు లంచం ఇచ్చిన ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. ఈ విషయాలను గమనిస్తే గవర్నర్ రామ్ నరేశ్ పాత్ర ఉందన్న విషయం అర్థమవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. వ్యాపమ్ కేసుకు సంబంధించిన వ్యక్తులు మృతిచెందడం వంటి ఘటనలు, గవర్నర్ పై ఆరోపణలకు ఊతమిస్తుండడాన్ని గమనిస్తే ఆయనపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు