ఉపాధ్యాయుడి అవతారమెత్తిన కలెక్టర్ !

10 Jun, 2016 19:45 IST|Sakshi
ఉపాధ్యాయుడి అవతారమెత్తిన కలెక్టర్ !

తిరువనంతపురం: జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. విద్యార్థులు చదువును కోల్పోకుండా ఉండేందుకు ఏకంగా తన కార్యాలయాన్నే బడిగా మార్చేశారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని మలపరంబ హైస్కూల్ మూతపడటంతో విద్యార్థులకు పాఠశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. పరిస్థితిపై దృష్టిసారించిన కలెక్టర్.. కార్యాలయంలో సగభాగాన్ని పాఠాలు చెప్పుకొనేందుకు ఇవ్వడంతోపాటు... విద్యార్థులకు ముఖ్యమైన సందేశాలను అందిస్తూ ఓరోజు తాను సైతం పాఠాలను చెప్పారు.

కేరళ కోజిఖోడ్ జిల్లాలోని మలపరంబ ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ రెండు రోజుల క్రితం మూతపడింది. కొన్ని కారణాలతో స్కూలును మూసివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. కేవలం పాఠశాల భవనం లేదన్న కారణంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని ఆలోచించిన జిల్లా కలెక్టర్.. విషయంపై మరింత దృష్టి సారించారు. తన కార్యాలయంలో సగభాగాన్ని తాత్కాలికంగా బడికి కేటాయించారు. దీంతో ఉపాధ్యాయులు సైతం  అక్కడికే వచ్చి పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా చేయించారు.

అయితే  ఎల్డీఎఫ్ ప్రభుత్వం పాఠశాలను స్వాధీనం చేసుకున్న అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలకు వెళ్లే అవకాశం ఉందని, స్కూల్ ఆందోళనల కారణంగా మూసివేయలేదని ఏఈవో చెప్పగా... త్వరలో పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని విద్యాశాఖ మంత్రి సి రవీంద్రనాథ్ వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు మలపరంబ స్కూల్ నిర్వహణా వ్యవహారాలను ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటుందని చెప్పారు.

కాన్ఫరెన్స్ హాల్లోకి చేరిన విద్యార్థులకు మొదటిరోజు కోజికోడ్ కలెక్టర్ ప్రశాంత్ పాఠాలు చెప్పారు. ప్రపంచంలో బతకాలంటే డబ్బు కన్నా విజ్ఞానం ఎంతో అవసరమన్నారు. ఇప్పటికే పాఠశాలను అధీనంలోకి తీసుకునేందుకు కావలసిన అన్ని ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేసిందని, త్వరలో స్కూల్ ను  స్వాధీనం చేసుకుంటుందని ప్రశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు