మావోయిస్టు నంబర్‌–2గా రంజిత్‌ బోస్‌

5 Feb, 2020 08:47 IST|Sakshi

న్యూఢిల్లీ: సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రెండో స్థానంలోకి బెంగాల్‌లోని హౌరా ప్రాంతానికి చెందిన రంజిత్‌ బోస్‌(63) అలియాస్‌ కబీర్‌ను ఎంపిక చేసుకుంది. గెరిల్లా యుద్ధతంత్రంతోపాటు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను ఏకం చేయడంలో ఈయన దిట్ట. రంజిత్‌ తలపై బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన రివార్డు మొత్తం రూ.కోటి వరకు ఉంది. బిహార్, జార్ఖండ్‌లతోపాటు తూర్పు భారతంలో పార్టీ పట్టు పెంచడం, సంచలన ఘటనలకు కార్యరూపం ఇచ్చేందుకే పార్టీ ఈ మార్పు చేపట్టిందని భావిస్తున్నారు. పార్టీలో రెండో స్థానంలో ఉన్న బెంగాల్‌లోని మిడ్నపూర్‌కు చెందిన ప్రశాంత్‌ బోస్‌(74)స్థానంలో రంజిత్‌ నియమితులయ్యారు.

అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజ్‌ సహా కీలక నేతలంతా ఇటీవల పశ్చిమబెంగాల్‌ అడవుల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం పొలిట్‌బ్యూరోలో ప్రస్తుతం నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజ్, రంజిత్‌ బోస్, మాజీ అధిపతి గణపతి, మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్, కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్, మిసిర్‌ బిస్రా అలియాస్‌ సాగర్‌ ఉన్నారు. బెంగాల్‌లో 2007లో నందిగ్రామ్‌లో నానో కార్ల ఫ్యాక్టరీని స్థాపించడంతో నాడు జరిగిన వ్యతిరేకోద్యమాన్ని రంజిత్‌ వెనక ఉండి నడిపించారు. దీంతోపాటు 44 గ్రామాలతో కూడిన లాల్‌గఢ్‌ను విముక్త ప్రాంతంగా ప్రకటించిన వ్యక్తిగా రంజిత్‌ బోస్‌కు పేరుంది. (చదవండి: షహీన్‌బాగ్‌ షూటర్‌ ఆప్‌ సభ్యుడే)

మరిన్ని వార్తలు