దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి..!

10 Jul, 2020 13:05 IST|Sakshi

మాయావతి డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ : పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్‌ చేశారు. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్ధానం పర్యవేక్షణలో పూర్తిస్ధాయిలో విచారణ జరపాలని ఆమె కోరారు. కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్‌ బృందం కాల్చిచంపిన క్రమంలో వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా మొత్తం వ్యవహారంపై ఉన్నతస్ధాయి విచారణ చేపట్టాలని మాయావతి డిమాండ్‌ చేశారు.

సమగ్ర దర్యాప్తుతోనే పోలీసులు, నేరస్తులు, రాజకీయ నేతలు కుమ్మక్కైన తీరు బయటకువస్తుందని, దోషులకు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలతోనే యూపీ నేరరహిత రాష్ట్రంగా మారుతుందని ఆమె ట్వీట్‌ చేశారు.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ  గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను శుక్రవారం ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు.

చదవండి : ‘వికాస్‌ దూబే హతం : మాకు పండుగ రోజే’

మరిన్ని వార్తలు