చిన్నారి ధనలక్ష్మి

2 Jan, 2018 08:42 IST|Sakshi

కొత్త ఏడాది తొలి నిమిషాల్లో ఆడశిశువు జననం

రూ. 5 లక్షల చెక్కును అందజేసిన మేయర్‌

అందరూ ఉత్కంఠగా ఎదురుచూసినా ఆడపిల్ల అదృష్టలక్ష్మి ఎవరో తేలిపోయింది. కొత్త ఏడాది తొలి నిమిషాల్లో భూమ్మీద పడిన ఆడశిశువును ధనలక్ష్మి దీవించింది. బెంగళూరు నగర మేయర్‌ సంపత్‌కుమార్‌ తన ప్రకటన మేరకు రూ. 5 లక్షల చెక్కును బాలిక తల్లికి అందజేశారు.

సాక్షి, బెంగళూరు: నూతన సంవత్సరం (2018) మొదటిరోజు ప్రారంభమైన ఐదు నిమిషాల్లో జన్మించిన ఆడశిశువుకు బీబీఎంపీ నుంచి రూ.5 లక్షల చెక్‌ను సోమవారం మేయర్‌ సంపత్‌రాజ్‌ అందజేశారు. రాజాజీనగర మొదటి స్టేజ్‌ నివాసి పుష్పకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రాగా రాజాజీనగర డీ.నాగరాజ ప్రసూతి ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్చారు. కొత్త ఏడాది ఆరంభమైన ఐదు నిమిషాలకు (12.05) పుష్ప ఆడబిడ్డకు జన్మినిచ్చింది. ఈ సమాచారం అందుకున్న బీబీఎంపీ ప్రదాన ఆరోగ్యాధికారి డాక్టర్‌.నిర్మల్‌ బుగ్గి, ఆ విషయాన్ని మేయర్‌ సంపత్‌రాజ్‌కు తెలిపారు.

కొత్త ఏడాది రోజున నగరంలోని పాలికె ప్రసూతి ఆస్పత్రిలో సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన మొట్టమొదటి ఆడశిశువుకు రూ. 5 లక్షల చెక్కును అందజేస్తామని మేయర్‌ నాలుగు రోజుల క్రితం ప్రకటించడం తెలసిందే. ఆ మేరకు మేయర్‌ సంపత్‌రాజ్‌ సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి బాలింత పుష్పకు చెక్‌ బహూకరించారు. రూ.5 లక్షల చెక్‌ను చిన్నారి పేరుతో బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామన్నారు. ఈ సందర్బంగా పుష్ప–గోపి దంపతులకు  శుభాకాంక్షలు  తెలియజేశారు.

బాలిక చదువుకు ఉపయోగిస్తాం
తన కుమార్తె కు ఐదు లక్షలు చెక్‌ అందడం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన తల్లిదండ్రులు.. ఆ నగదుపై వచ్చే వడ్డీని బాలిక చదువుకు మాత్రమే వినియోగిస్తామని తెలిపారు. డిప్యూటీ మేయర్‌ పద్మావతి నరసింహమూర్తి, ఆరోగ్యస్దాయీసమితి అద్యక్షుడు ముజాహిద్‌పాషా, డాక్టర్‌ నిర్మల్‌బుగ్గి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు