‘సైకాలజిస్ట్‌ కావడమే నా లక్ష్యం...’

26 May, 2018 16:09 IST|Sakshi
సీబీఎస్‌ఈ క్లాస్‌ 12 ఆల్‌ఇండియా టాపర్‌ మేఘన శ్రీవాత్సవ

సీబీఎస్‌ఈ ఆలిండియా టాపర్‌ మేఘనా శ్రీవాత్సవ

సాక్షి, న్యూఢిల్లీ : గత నెల రోజులుగా విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాలను శనివారం వెల్లడించారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత శాతంలో విద్యార్థినులే ముందున్నారు. అదేవిధంగా మొదటి మూడు స్థానాల్లోనూ నిలిచి మరోసారి సత్తా చాటారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన మేఘన శ్రీవాస్తవ 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, అదే రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థిని అనౌష్క చంద్ర 498 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన చాహత్‌ బోద్‌రాజ్‌ 497 మార్కులు సాధించి మరో ఆరుగురు విద్యార్థినులతో సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించారు.

అసలు ఊహించలేదు...
సీబీఎస్‌ఈ ఆలిండియా టాపర్‌ మేఘన శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ.. ‘  టాపర్‌గా నిలవడానికి నేను ప్రత్యేకంగా ట్యూషన్‌కి కూడా వెళ్లలేదు. మంచి మార్కులు వస్తాయని ఊహించాను. కానీ టాపర్‌గా నిలుస్తాననుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. సంవత్సరమంతా ఎంతో కష్టపడి చదివాను. అందుకు ఫలితంగా నేడు నా కల నిజమైంది. హార్డ్‌వర్క్‌ చేయడంతోపాటు.. నిలకడ, నిబద్ధత కూడా చాలా ముఖ్యం. ఒత్తిడికి లోనైతే ఏమీ సాధించలేమంటూ’  తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. హ్యుమానిటీస్‌ అభ్యసించిన తాను సైకాలజిస్ట్‌ కావాలనుకుంటున్నానని మేఘన తెలిపారు. మరో విద్యార్థిని చాహత్‌ బోద్‌రాజ్‌ కూడా సైకాలజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవడమే తన ముం​దున్న లక్ష్యమని పేర్కొన్నారు.

కాగా ఫలితాల్లో త్రివేండ్రం (97.32 శాతం), చెన్నై (93.87 శాతం), ఢిల్లీ (89 శాతం) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2017లో 82.02మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 83.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈసారి కూడా 88.31 శాతం ఉత్తీర్ణతో విద్యార్థినులే ముందంజలో ఉండగా.. విద్యార్థులు 78.09 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మరిన్ని వార్తలు