ప్రభుత్వ సీబీఎస్‌ఈ స్కూళ్లల్లో తొలిసారి పరీక్షలు

5 Oct, 2023 04:33 IST|Sakshi

ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి..

8, 9 తరగతులకు పీడబ్ల్యూటీ, టర్మ్‌ టెస్ట్‌లు

ఈ నెల 12 వరకు తొమ్మిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ రిజిస్ట్రేషన్లు 

రేపటి నుంచి 9 వరకు పీడబ్ల్యూటీ పరీక్షలు

పదో తరగతికి ఐదు పేపర్లు, ఆరో పేపర్‌గా స్కిల్‌ టెస్ట్‌

ఏప్రిల్‌ 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధన

సాక్షి, అమరావతి: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి 8, 9 తరగతుల విద్యార్థులు పీరియాడిక్‌ రాత పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్‌ పరీక్షలు రాయ­నున్నారు. గతేడాది 1,000 ప్ర­భుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు వచ్చి­న సంగతి తెలిసిందే.

అయితే అప్పటికే దాదాపు విద్యా సంవత్సరం పూర్తవడంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థు­లు స్టేట్‌ బోర్డు పరీక్షలైన ఫార్మేటివ్, సమ్మేటివ్‌ అసెస్‌­మెంట్లకే హాజ­ర­య్యారు. కాగా, ఈ విద్యా సంవత్స­రం (2023­–24) నుంచి సీబీఎస్‌ఈ బోర్డు నిర్వహించే పీడబ్ల్యూటీ, టర్మ్‌ పరీక్షలు రాయను­న్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో వెయ్యి పాఠ­శాలల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ బోధ­నకు అను­మతి వచ్చింది.

ఈ పాఠశాలల్లో 8, 9 తర­గతు­లు చదువుతున్న విద్యార్థులు 2023–24 నుం­చి సీబీఎస్‌­ఈ అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకా­రం ఆ బోర్డు పరీక్షలు రాస్తారని పాఠశాల విద్యా­శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖా­ధి­కారులకు కమిషన­ర్‌ ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీని ప్రకా­రం 8, 9 తరగతులకు ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షల తరహాలో పీరియాడిక్‌ పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్‌ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ నెల 6 నుంచి 9 వరకు పీడబ్ల్యూటీ జరగనున్నాయి. 

విషయ పరిజ్ఞానం పెంచేలా..
విద్యా సంవత్సరంలో పీడబ్ల్యూటీలు నాలుగు, టర్మ్‌ పరీక్షలు రెండు ఉంటాయి. టర్మ్‌–1 నవంబర్‌లో, టర్మ్‌–2 (వార్షిక) పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, రెండు భాషా పేపర్లు (మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు) రాయాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టు 50 మార్కులకు నిర్వహించే పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత, 10 మార్కులకు ఇంటర్నల్‌ థియరీ పరీక్ష ఉంటుంది. 100 మార్కుల టర్మ్‌ పరీక్షలో 80 మార్కులకు రాత, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు (ఇంటర్నల్‌ థియరీ) ఉంటాయి.

విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలంటే ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. సబ్జెక్టుల్లో ప్రాజెక్టులు, ల్యాబ్‌ టెస్టులు కూడా ఉంటాయి. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా విద్యార్థులతో పోటీపడేలా పరీక్షల్లో విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇవ్వనున్నారు. అకడమిక్‌ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా ఇంటర్నల్‌ పరీక్షలు ఉంటాయి. ఇందులో పెన్‌ పేపర్‌ టెస్ట్‌ (5 మార్కులు), మల్టిపుల్‌ అసెస్‌మెంట్‌ (5), ఫోర్ట్‌పోలియో (5), సబ్జె­క్టుపై విద్యార్థికున్న అవగాహనకు 5 మార్కులు మొత్తం 20 మార్కులు కేటాయించారు.

భాషా పరీక్షలో వ్యూహాత్మకంగా పరిష్కరించే పజిల్స్, క్లాస్‌వర్క్, ఇంగ్లిష్‌ మాట్లాడడం, విని అర్థం చేసుకునే సామర్థ్యంపైన ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న 85,353 మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోర్డు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. వీరికి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అన్ని పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్‌ 1 నుంచి 10వ తరగతి సిలబస్‌ను బోధించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 

10వ తరగతిలో ‘స్కిల్‌’ సబ్జెక్టు 
ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం(2024–25)లో 10వ తరగతిలో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రాయనున్నారు. ఈ క్రమంలో వీరికి ఆరో సబ్జెక్టుగా ‘స్కిల్‌ టెస్ట్‌’ను ప్రవేశ­పెట్టారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌ పరీక్షలో తప్పిన విద్యార్థులు స్కిల్‌ సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుని పాస్‌ చేస్తారు. ఆరో సబ్జెక్టుగా విద్యార్థుల కోసం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. పదో తరగతి విద్యార్థులు ఈ రెండింటిలో ఒకదాన్ని ఆరో సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. 

జాగ్రత్త పాటించండి
సీబీఎస్‌ఈ బోర్డు క్యాలెండర్‌ ప్రకారం.. వచ్చే మార్చి 31 నాటికి 9వ తరగతి పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్‌ 1 నుంచి 10వ తరగతి బోధన చేపట్టాలి. అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థుల బోర్డు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ నెల 12 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల వివరాల నమోదులో పాఠశాలల ప్రిన్సిపాళ్లు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థి పేరు, ఆధార్, తల్లిదండ్రుల వివరాలు పుట్టిన తేదీ ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్త వహించాలి. – ఎం.వి.కృష్ణారెడ్డి, డైరెక్టర్, సీబీఎస్‌ఈ స్కూల్స్‌. 

మరిన్ని వార్తలు