నా తల్లిని కూడా కలవనివ్వరా?

8 Aug, 2019 17:59 IST|Sakshi

శ్రీనగర్‌ : తనని గృహనిర్భందం చేయడం పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూతురు సనా ఇల్తిజా జావెద్‌ వ్యాఖ్యానించారు. తనకు బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకపోయినా అక్రమంగా నిర్భందించారని వాపోయారు. ‘నన్ను మా అమ్మ నుంచి దూరం చేశారు. ఆమె దగ్గరకు వెళ్లనివ్వండని నేను చాలా సార్లు పోలీసులను అభ్యర్థించాను. మా అమ్మను కలవాలనుకున్నా.. వారు అభద్రతకు గురువుతున్నారాంటే ఆశ్చర్యం వేస్తోంది. ఒక తల్లిని కూతురు కలుసుకునే హక్కు కూడా లేదా? వీరు ఇంతలా భయపడుతున్నారంటే దానర్థం ఆర్టికల్‌ 370ని తొలగించడం రాజ్యాంగ విరుద్దమని భావించారు కనుకనే ఇలా చేస్తున్నారు’ అని వెల్లడించారు.

‘నన్ను కలవడానికి కూడా ఎవ్వరికీ అనుమతి ఇవ్వట్లేదు. నేను ఒక కశ్మీరీని, భారతీయ పౌరురాలుని, అసలు రాజకీయాలే తెలియని ఒక సాధారణ మహిళని, అయినా నన్ను చూసి ఇంతలా ఎందుకు భయపడుతున్నారు. ఏం స్వేచ్ఛగా, స్వతంత్రంగా తిరిగే హక్కులు మాకు లేవా’ అని ప్రశ్నించారు. కశ్మీరీల హక్కులను, గౌరవాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మేం చేస్తున్న ప్రయత్నాన్ని దేశం లేదా అంతర్జాతీయ సమాజం చూడాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నా తల్లి స్ఫూర్తిని దెబ్బతీయాలని చూస్తోంది. తను వారి మాయలో పడదని, తను చాలా బలమైన మహిళని పేర్కొన్నారు. కాగా ఆగస్టు 4 నుంచి జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలని గృహ నిర్భందంలో ఉంచిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు