ప్రభుత్వ ఉద్యోగి చేత షూలేస్‌ కట్టించుకున్న మంత్రి

22 Jun, 2019 10:39 IST|Sakshi

లక్నో : కొందరు మంత్రులు చెలాయిస్తున్న అధికార దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో. ప్రభుత్వాధికారి చేత షూలేస్‌ కట్టించుకోవడమే కాక రామయణాన్ని తెర మీదకు తెచ్చి మరి దాన్ని సమర్థించుకున్నాడో మినిస్టర్‌. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌ మినిస్టర్‌ లక్ష్మీ నారాయణ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షాజహాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సదరు మినిస్టర్‌ షూ లేస్‌ ఊడిపోయింది. దాంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వెంటనే వెళ్లి అమాత్యుల వారి షూలేస్‌ కట్టి తన ప్రభు భక్తిని చాటుకున్నాడు. వారించాల్సిన మినిస్టర్‌ కాస్తా దర్జాగా నిల్చూని ప్రభుత్వ ఉద్యోగి చేత సేవ చేపించుకుని తరించారు.
 

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో లక్ష్మీ నారాయణ్‌ని, ఉద్యోగిని తెగ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సంఘటన గురించి లక్ష్మీ నారాయణ్‌ని ప్రశ్నించగా.. ఆయన సిగ్గుపడకపోగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘షూ లేస్‌ కట్టి నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను. భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ రాముని బదులు ఆయన పాదరక్షలు 14 ఏళ్ల పాటు పాలన చేశాయి. మన పురాణాల్లో పాద రక్షలకు చాలా ప్రాధాన్యం ఉంది. అలాంటి చెప్పులు ధరించే విషయంలో నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను’ అంటూ రామయణాన్ని తెరమీదకు తెచ్చి పొంతన లేని వాదనను వినిపించాడు.

అయితే ఇలా తలా తోకా లేకుండా మాట్లాడటం సదరు మినిస్టర్‌కు కొత్త కాదు. గతంలో హనుమంతుడు జాట్‌ల తెగకు చెందిన వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లక్ష్మి నారాయణన్‌.

మరిన్ని వార్తలు