కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశం

2 May, 2017 00:47 IST|Sakshi
కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశం

టర్కీ అధ్యక్షుడికి భారత్‌ స్పష్టీకరణ
న్యూఢిల్లీ:  కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం బహుళ పక్ష చర్చలు జరపాలని, అందులో తామూ పాలుపంచుకుంటామని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌ చేసిన సూచనను భారత్‌ తోసిపుచ్చింది. ఇది ద్వైపాక్షిక అంశమని, సీమాంతర ఉగ్రవాదం దీనికి కారణమని ఆయనకు స్పష్టం చేసింది.

భారత పర్యటన ప్రారంభ సందర్భంగా ఎర్డోగన్‌ ఆదివారం ఓ ఇంటర్వూ్యలో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు. సోమవారం ఢిల్లీ లో ఆయన ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఉగ్రవాదం, కశ్మీర్‌లపై తమ వాదనను ఎర్దోగన్‌కు స్పష్టం చేశామని విదేశాంగ ప్రతినిధి గోపాల్‌ బాగ్లే విలేకరులకు చెప్పా రు. ‘ఉద్దేశం ఏదైనా ఉగ్రవాదాన్ని సమర్థించకూడదని తేల్చిచెప్పాం. పాక్‌తో కశ్మీర్‌ సహా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మేం సిద్ధం. మా వాదనను టర్కీ జాగ్రత్తగా ఆలకించింది’ అనిఅన్నారు.  

ఉగ్రపోరులో సాయం చేస్తాం: ఎర్డోగన్‌
ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సాయం చేస్తామని మోదీతో భేటీలో ఎర్డోగన్‌ హామీ ఇచ్చారు. ఉగ్రవాదం ఇరు దేశాలకు ఆందోళనకరమన్న ఇరువురు నేతలు చర్చల తర్వాత విలేకర్లతో మాట్లాడారు. ‘ఉగ్రవాదం సక్రమమైందని ఉద్దేశం, ఏ కారణమూ చెప్పజాలదు. ఈ భూతాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించాం’ అని మోదీ తెలిపారు.

ఎర్డోగన్‌ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు టెలికం సహా పలు రంగాల్లో మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చర్చలకు ముందు మోదీ, ఎర్డోగన్‌లు భారత్‌–టర్కీ వ్యాపారుల సదస్సులో మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీతో చర్చలకు ముందు ఎర్డోగన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘనస్వాగతం లభించింది. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఎర్డోగన్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు