సాధ్వి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు!

5 Dec, 2014 01:09 IST|Sakshi
సాధ్వి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు!

 రాజ్యసభలో ప్రధాని ప్రకటన
 శాంతించని విపక్షం;
 సాధ్వి రాజీనామాకు డిమాండ్
 వరుసగా మూడోరోజూ
 ఉభయ సభల్లో ప్రతిష్టంభన
 
 న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారం వరుసగా మూడో రోజూ పార్లమెంటును కుదిపేసింది. మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయడమో లేక మంత్రిమండలి నుంచి ఆమెను తొలగించడమో చేయాల్సిందేనంటూ విపక్షమంతా ఒక్కటై గురువారం ఉభయసభలను స్తంభింపచేసింది. సాధ్వి జ్యోతి క్షమాపణ కోరారంటే దానర్థం ఆమె నేరం చేశానని ఒప్పుకున్నట్లేనని.. అందువల్ల మంత్రిగా కొనసాగే అర్హత ఆమెకు లేదని వాదించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రకటన చేసినప్పటికీ.. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు.
 
 ఈ అంశంపై స్పందించకుండా గత మూడు రోజులుగా మౌనం పాటించిన ప్రధాని గురువారం ఎట్టకేలకు స్పందించారు. రాజ్యసభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ.. సాధ్వి నిరంజన జ్యోతి చేసిన వ్యాఖ్యలు తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదనీయం కాదని తేల్చి చెప్పారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగిన రోజే సాధ్వి నిరంజన జ్యోతి చేసిన వ్యాఖ్యల విషయం తెలిసింది. అలాంటి భాష వాడకూడదంటూ ఆ రోజే మా ఎంపీలకు చెప్పాను. ఆమె సభకు కొత్త. ఆమె నేపథ్యం మనకు తెలుసు. ఎన్నికల వేడిలో అలా మాట్లాడారు. అయినా, అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అవి మాకు ఆమోదనీయం కాదు.
 
 అయితే, సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పారు కాబట్టి.. క్షమాపణలకు అర్థమేంటో తెలిసిన  సీనియర్ సభ్యులు దేశ ప్రయోజనాల కోసం సభ సజావుగా సాగేందుకు సహకరించాలి. ఈ క్షమాపణల ద్వారా భాష విషయంలో హద్దులు దాటకూడదని, గౌరవమర్యాదలు పాటించాలని మనందరికి ఒక సందేశం వెళ్లింది’ అని వివరణ ఇచ్చారు. అయినా శాంతించని కాంగ్రెస్, తృణమూల్, ఆప్ తదితర విపక్ష పార్టీల సభ్యులు ఆమెను తొలగించాల్సిందేనంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రధాని నుంచి కొన్ని వివరణలు కావాలన్న విపక్ష సభ్యుల అభ్యర్థనలను డిప్యూటీ చైర్మన్ అనుమతించలేదు. దాంతో వారు వెల్‌లోకి దూసుకెళ్లి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. అప్పటికే నాలుగుసార్లు వాయిదాపడిన సభను డెప్యూటీ చైర్మన్ శుక్రవారానికి వాయిదా వేశారు.
 
 లోక్‌సభలోనూ..: సాధ్వి జ్యోతి వ్యాఖ్యలపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దానికి ప్రధాని నుంచి స్పందన రాకపోవడంతో సభా కార్యక్రమాలను బహిష్కరించాలని మూకుమ్మడిగా నిర్ణయించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలతో సభను అడ్డుకున్నారు. అధికారపక్ష సభ్యుల నిరసనల మధ్యనే.. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉండటంతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
 
 ప్రభుత్వ వైఖరిని అడ్డుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌దేనన్నారు. అనంతరం టీఎంసీ, ఆప్, ఎస్పీ, ముస్లిం లీగ్ సభ్యులతో కలసి పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సాధ్వి జ్యోతి వ్యాఖ్యలను ప్రధాని సమర్ధిస్తున్నారా? ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని సభ కోరుకుంటోంది. రెండు రోజులుగా ఈ అంశాన్ని లేవనెత్తడానికి మేం ప్రయత్నిస్తున్నా ప్రధాని నుంచి స్పందన లేదు. మాకు మెజారిటీ ఉంది. మేమేమైనా చేస్తాం అన్నట్లుగా వారి వైఖరి ఉంది’ అని ఖర్గే ధ్వజమెత్తారు.
 
 ఎన్నాళ్లీ ప్రతిష్టంభన
 సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యల అంశం గత మూడు రోజులుగా రాజ్యసభను స్తంభింపజేయగా, లోక్‌సభలోనూ ఆ ప్రకంపనలు గట్టిగానే ఉన్నాయి. సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పారు కనుక ఈ అంశాన్ని వదిలేయాలని, ఆమెను పదవి నుంచి తొలగించబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అయితే 30% ఓట్లు మాత్రమే సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తన వ్యాఖ్యలతో మిగతా 70% ప్రజలను ఆమె అవమానించారని, అందువల్ల ఆమెను తొలగించడమే న్యాయమని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. దీంతో పార్లమెంటులో ఈ ప్రతిష్టంభన తొలగేలా కనిపించడం లేదు.

>
మరిన్ని వార్తలు