నా పేరు ఉంది.. మా పిల్లల పేర్లేవి?

1 Sep, 2019 15:46 IST|Sakshi

అసోం: అసోం రాష్ట్రానికి సంబంధించి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్ (ఎన్‌ఆర్‌సి) శనివారం ప్రకటించిన చివరి జాబితాలో లక్షల్లో పేర్లు లేకపోవడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడం గమనార్హం. దీనిపై మీనా హజారికా అనే మహిళ తమ ఇద్దరి కూతుర్లు బర్నాలి, మిథు పేర్లు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి, రెండో జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ కుమార్తెల పేర్లు లేకపోవడంతో ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. తన పేరు ఉన్నప్పుడు, కుమార్తెల పేర్లు ఎందుకు లేవని ఆమె ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే పూర్తి చిరునామాలతో కూడిన దృవపత్రాలను(ఎన్‌ఆర్‌సి)కి సమర్పించారు. తామేమీ బంగ్లాదేశీయులం కాదంటూ ఆమె అధికారులపై విరుచుకుపడ్డారు. తాము బ్రిటిష్‌ కాలం నుంచి ఇక్కడే నివసిస్తున్నామని అన్నారు. దృవపత్రాలను సమర్పించినా తమ కుమార్తెల పేర్లలో తపులున్నాయని చెప్పడంతో ఆమె మరోసారి షాక్‌కు గురయ్యారు.

అంతకుముందు పేర్లను సరిచేయడంలో భాగంగా డాక్యుమెంటేషన్ రూపొందించడానికి విపరీతంగా ఖర్చయిందని హజారికా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును ఖర్చు పెట్టానని అన్నారు. చివరకు అందులో తమ పిల్లలు పేర్లు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించకుంటే తమకు చావే శరణ్యమన్నారు. తన ప్రపంచం ముగిసిపోయినట్లు ఉందని ఉద్వేగంగా మాట్లడారు. అయితే రీసర్టిఫికేషన్‌ కోసం సెప్టెంబర్‌7 వరకూ నిరీక్షించామని అధికారులు చెప్పినట్లు ఆమె తెలిపారు. ఇందుకు తన వద్ద డబ్బులు లేవన్నారు. కాగా, జాబితాలో పేర్లు లేని కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు జాబితాలో పేర్లు లేనివారు విదేశీ ట్రిబ్యునల్స్ కు అప్పీల్‌ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు